Apr 26,2023 00:22

మాట్లాడుతున్న సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు

ప్రజాశక్తి -అరకులోయ :అరకులోయ నియోజకవర్గ కేంద్రంలో సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రచార భేరి బహిరంగ సభ విజయవంతమైంది. ఈ నెల 14న ముంచంగిపుట్టు మండలంలో కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రారంభమైన ఈ 'ప్రచార భేరి' అరకులోయ సభతో ముగిసింది. ఈ సందర్భంగా అరకులోయ ఎన్‌టిఆర్‌ పార్కులోని అల్లూరి సీతారామరాజు గ్రౌండ్‌ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమైంది. పెట్రోల్‌ బంకు, ఎంపిడిఒ కార్యాలయం టౌన్‌షిప్‌ మీదుగా వైఎస్‌ఆర్‌ జంక్షన్‌, ఐటిడిఎ షాపింగ్‌ కాంప్లెక్స్‌ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో సిపిఎం, సిపిఐ నాయకులు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పెద్దపెట్టున నినాదాలు చేశారు. సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బివి.రాఘవులు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర, జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స, అనంతగిరి జెడ్‌పిటిసి డి.గంగరాజు, సిపిఎం నేతలు ఉమామహేశ్వరరావు, పొద్దు బాలదేవ్‌, రామారావులు ర్యాలీ అగ్రభాగాన నిలిచారు. పెద్ద సంఖ్యలో ఆదివాసీలు తరలిరావడంతో అరకులోయ ఎరుపు సంద్రంగా మారింది. డప్పుల శబ్దాలతో, గిరిజన సంప్రదాయ నృత్యాలతో దద్దరిల్లింది. బహిరంగ సభ ముగిసే వరకు నాయకుల ప్రసంగాలను జనం ఆసక్తిగా వినడం విశేషం.
బహిరంగ సభ సాగిందిలా..
బహిరంగ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి.రాఘవులు మాట్లాడుతూ గిరిజన హక్కులు, చట్టాలను పరిరక్షించుకోవడానికి అల్లూరి స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు. గిరిజన సంపదను లూటీ చేసి దోచుకెళ్లిపోవడానికి కుట్రలు జరుగుతున్నాయని తెలిపారు. ఆదివాసీలకు ఆర్థికంగా ఉపయోగపడే స్కీంలన్నింటినీ ఎత్తివేస్తున్నారని అన్నారు. ఉపాధి హామీ చట్టానికి రూ.20 వేల కోట్ల కోత విధించినా సిఎం జగన్‌ కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. గిరిజన ప్రాంతంలోని కాపీ, జీడిపప్పుకు గిట్టుబాటు ధర కరువైందన్నారు. గిరిజన యూనివర్సిటీకి నేటి వరకూ భవనాలు నిర్మించలేదన్నారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఏజెన్సీలో నేటికీ డోలీ మోతలే దిక్కు అవుతున్నాయన్నారు. ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సిబ్బంది కరువయ్యారని తెలిపారు. నూతన విద్యా విధానం పేరుతో మన్యంలో విద్యను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్న విద్యాలయాలను మూసేసి పాడేరు వంటి చోట్ల మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తే అవి ఎవరికి అవసరమని ప్రశ్నించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి నాణ్యమైన విద్యను అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రజా ప్రతినిధులు మాట్లాడకుండా ఉండడం సరికాదన్నారు. ప్రజలకు అండగా నిలబడేది సిపిఎం, సిపిఐలు మాత్రమేనన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అన్నారు. అధికారులు ఈ చట్టాన్ని తుంగలో తొక్కడం వల్ల గిరిజనేతరుల ఆగడాలు పెరిగిపోతున్నాయని తెలిపారు. బోయ/వాల్మీకిలను, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో కలపడానికి ప్రభుత్వం తీర్మానం చేస్తే గిరిజన ప్రజాప్రతినిధులు నోరుమెదపకపోవడం దారుణమన్నారు. ఆదివాసీలు హక్కుల కోసం మాట్లాడితే నిర్బంధించడం అన్యాయమన్నారు. జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్స మాట్లాడుతూ అదానీ అభివృద్ధికే మోడీ కృషి చేస్తున్నారు తప్ప గిరిజనుల కోసం కాదని అన్నారు. గిరిజనుల హక్కులు, చట్టాలను రక్షించుకోవడానికి విస్తృత పోరాటం అవసరమని అన్నారు. రాష్ట్రంలో జగన్‌ నియంత పాలన కొనసాగుతోందని, ఎర్రవరం, చిట్టంపాడు, తదితర చోట్ల ఐదు హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు నిర్మించడానికి పూనుకున్నారని తెలిపారు. గిరిజనుల సాగు భూముల్లో డ్యాములు కడుతుంటే గ్రామాలు మునిగిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలు తెలిసినా ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకులు కీలుబొమ్మలుగా ఉండడం దురదృష్టకరమన్నారు. జగన్‌, నరేంద్ర మోడీ గిరిజనుల కోసం ఎటువంటి అజెండా రూపొందించలేదన్నారు. అనంతగిరి జెడ్‌పిటిసి డి.గంగరాజు మాట్లాడుతూ మోడీ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. రొంపిల్లి పంచాయితీలో భూస్వాములు గిరిజనుల భూములను రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని తెలిపారు. బాధ్యులపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మోడీని గద్దె దించితేనే గిరిజన హక్కులు, చట్టాలు రక్షించుకోవడం సాధ్యపడుతుందన్నారు. సభలో సిపిఎం నేతలు పోతురాజు, రామారావు, జయ, సన్నిబాబు, హైమావతి, త్రినాథ్‌, సుందరరావు, నాగులు, లక్ష్మణ్‌, పృధ్వీరాజ్‌, భీమరాజు, సర్పంచులు చిన్నబాబు, మొస్య, బాలదేవ్‌, శరభన్న, సత్యనారాయణ, ఎంఎం.శ్రీను, రామారావు, రామన్న పాల్గొన్నారు.