Apr 09,2023 23:53

సమావేశమైన సిపిఎం, సిపిఐ నాయకులు

ప్రజాశక్తి - గుంటూరు : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజల్లో ప్రచారం చేసేందుకు సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ఈనెల 14-30 తేదీల్లో గుంటూరు నగరంలో విస్తృత ప్రచారాన్ని జయప్రదం చేయాలని ఆయా పార్టీల నగర కార్యదర్శులు కె.నళినికాంత్‌, కె.మాల్యాద్రి పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రచారంపై కార్యాచరణను సిపిఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో రూపొందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక రాజ్యాంగానికి తూట్లు పొడుస్తోందని, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలు, కార్పొరేట్లకు కట్టబెడుతూ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. ఈ అంశాలపై ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టడానికి గుంటూరు నగరంలో వివిధ పేటల్లో సభలు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు కె.శ్రీనివాసరావు, బి.ముత్యాలరావు, సిపిఐ నగర కార్యదర్శివర్గ సభ్యులు ఎ.అరుణ్‌ కుమార్‌, అంజిబాబు, సిహెచ్‌.మరియదాసు పాల్గొన్నారు.