విస్తృత, వికృత ప్రచారాల వెల్లువ జిల్లాలో కనిపిస్తుంది. ఇలాంటి ప్రచారాలకు అంతం ఉండకపోగా, ఊపునిచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో సరికొత్త సమీకరణాలకు సవాళ్లుగా మారుతున్నాయి. ప్రచార వెల్లువలో ఎవరూ ఊహించని ప్రచారం సాగింది. కాంగ్రెస్ వారసత్వం పుణికిపుచ్చుకున్న కుటుంబం నుంచి జిల్లా అధ్యక్షులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతిని వైసిపిలోకి కొందరు నేతలు ఆహ్వానించారన్నది ఆ ప్రచారంలో సారాంశం. ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కీ.శే బొడ్డేపల్లి రాజగోపాలరావు జయంతోత్సవాలు జరిగాయి. ఆ సమయంలోనే కొందరు వైసిపి నేతలు ఆమెను పార్టీలోకి వస్తే మంచిదని ఆహ్వానించినట్లు ప్రచారం మొదలైంది. ఆ ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించినట్లు తెలిసింది. ఆమదాలవలస కేంద్రంగానే మరో ప్రచారం ముందుకొచ్చింది. టిడిపి జిల్లా అధ్యక్షులు కూన రవికుమార్‌ను వైసిపిలోకి ఆహ్వానిస్తున్నారన్నది ఆ ప్రచారం. టిడిపిలోని మరో ప్రధాన సామాజిక తరగతి నుంచి ఆ ప్రచారం మొదలైందని, దాని వెనుక ముఖ్య నేతల హస్తం ఉందన్న ప్రచారం ఆ పార్టీ శ్రేణుల్లోనే ఉంది. ఆమదాలవలస కేంద్రంగా జరిగిన ప్రయత్నాలు, ప్రచారాలు బెడిసికొట్టినట్లు స్పష్టమైంది. వైసిపి ఎంపీ టిక్కెట్ విషయంలోనే ఇలాంటి ప్రయత్నాలు మొదలైనట్లు కనిపిస్తుంది. మొదట్లో వైసిపి ఎంపీ అభ్యర్థులుగా తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ పేర్లు ముందుకొచ్చాయి. తనయులకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తే తాము ఎంపీగా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అధినేత ముందు చెప్పినట్లు తెలిసింది. అందుకు ఎర్ర లైట్ వెలగడంతో మౌనం దాల్చడం వారి వంతైంది. తాజాగా ధర్మాన ప్రసాదరావు తాను ఎంపీగా వెళ్లడం లేదని స్పష్టం చేయగా, పార్టీ ఆదేశిస్తే ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని కృష్ణదాస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఇద్దరు డాక్టర్లు కిల్లి కృపారాణి, దానేటి శ్రీధర్ పేర్లు మాత్రమే ఎంపీ బరిలో వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరు అభ్యర్థి అవుతారో, కొత్త వారు తెరపైకి వస్తారో ఇప్పటికే చెప్పలేని స్థితిలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు తెలిసింది.
ఇచ్ఛాపురం నియోజకవర్గంలో వైసిపికి తలనొప్పులు మొదలయ్యాయి. నియోజకవర్గంలో ప్రధాన సామాజిక తరగతులైన కళింగ, యాదవులకు పార్టీ గుర్తింపునిచ్చింది. మరో ప్రధాన సామాజిక తరగతి అయిన రెడ్డికకు ఈసారి టిక్కెట్ ఇవ్వాలని ఆ సామాజిక తరగతి కారాలు మిరియాలు నూరుతున్నట్లు తెలిసింది. వారికి వెనుక నుంచి యాదవ సామాజిక తరగతి ప్రోత్సహిస్తున్నట్ల సమాచారం. ఈసారి సాయిరాజ్ కాకుండా ఆయన భార్య జెడ్‌పి చైర్‌పర్సన్ విజయకు టిక్కెట్ ఇవ్వాలన్న ప్రయత్నంలో కళింగ సామాజిక తరగతి తరుపున సాయిరాజ్ ఉన్నట్లు తెలిసింది. పలాస నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు పార్టీ నేతల నుంచే నిరసన సెగలను ఎదుర్కొంటున్నారు. నాయకత్వం ఇప్పటివరకు ఆ ఎడబాటును దగ్గర చేయలేదు. మంత్రి మళ్లీ అభ్యర్థి అయితే ఓడిస్తామన్న స్థాయికి అసమ్మతి గ్రూపు ప్రకటనలు చేయడం చూశాం. టిడిపి విషయంలో ఈసారి గౌతు శిరీషకు టిక్కెట్ ఇవ్వాలా?, ఆమె తండ్రి గౌతు శ్యామసుందర శివాజీకి ఇవ్వాలా అన్న మీమాంసలో అధినాయకత్వం ఉందని విశ్వసనీయంగా తెలిసింది. జనసేనతో పొత్తు ఉంటే పలాస నియోజకవర్గాన్ని ఆ పార్టీకి వదిలేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
పాతపట్నం నియోజకవర్గంలో చంద్రబాబు ప్రాజెక్టుల పరిశీలనలో గ్రూపుల గాయాలు చూశాం. మున్ముందు ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో చూడాల్సి ఉంది. వైసిపిలోనూ అసమ్మతిరాగం, గ్రూపుల గానం వినిపిస్తోంది. స్థానికులకు టిక్కెట్ ఇవ్వాలన్న నినాదం బలంగా వినిపిస్తోంది. టెక్కలి నియోజకవర్గంలో వైసిపి విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇద్దరు పరస్పరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి పదవిని పంచుకున్నా, కొత్తవారు తెర పైకి వచ్చే అవకాశం లేకపోలేదన్న ప్రచారం పార్టీలోనే ఉంది. నరసన్నపేట నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి ఎవరన్న ప్రచారం ఉంది. బగ్గు రమణమూర్తికి నాయకత్వం నుంచి భరోసా లభించినా, డాక్టర్ బగ్గు శ్రీనివాసరావుతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడి రాజకీయాల్లోకి వస్తే వైద్య వృత్తి మాటేమిటని అడిగినట్లు విశ్వసనీయంగా తెలిసింది. 40 శాతం టిక్కెట్లు యువతకు ఇస్తామన్నది అమలైతే, అందులో తానుంటానన్న అభిప్రాయంలో శ్రీనివాసరావు ఉన్నారని తెలిసింది. శ్రీకాకుళం నియోజకవర్గంలో టిడిపిలో గ్రూపుల గోల సద్దుమణిగింది. ఎన్నికల సమయంలో ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది. టిక్కెట్ మాత్రం గుండ కుటుంబం నుంచి బయటకు పోదని స్పష్టంగా తెలుస్తోంది. ఆమదాలవలస నియోజకవర్గంలో టిడిపికి ఎలాంటి సమస్య లేదు. వైసిపి విషయంలోనే ఎంపీ అభ్యర్థిగా సీతారాంను బరిలో దించాలన్న ప్రతిపాదన ముందుకొస్తోంది. నాయకుల వారసులకు టిక్కెట్లు ఉండవని అధినేత జగన్ ఇప్పటికే స్పష్టం చేసినట్లు తెలిసింది. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైసిపి, టిడిపి మధ్య ఉన్న వైరానికి మించి గ్రూపుల గోల సాగుతోంది. మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును విజయనగరం ఎంపీ అభ్యర్థిగా బరిలో దించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు తెలిసింది. ఎమ్మెల్యే టిక్కెట్ తన కొడుక్కి ఇవ్వాలని కళా వెంకట్రావు కోరగా, పార్టీ అందుకు సుముఖత చూపడం లేదని తెలిసింది. అందువల్ల ఎచ్చెర్ల అభ్యర్థి కళా వెంకట్రావు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైసిపి విషయంలోనూ గ్రూపు గోల బలంగా ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను వస్తారన్న ప్రచారం మళ్లీ మొదలైంది. ఎమ్మెల్యే కిరణ్ కుమార్‌రెడ్డిపై అసమ్మతి రాగం బలపడితే అభ్యర్థి మారే అవకాశాలు ఉన్నాయి. వచ్చే నెల నుంచి వెనుకా ముందు రెండు పార్టీలు టిక్కెట్లు ప్రకటించనున్నట్లు అమరావతి వర్గాల భోగట్టా. మారుతున్న సమీకరణాలు, వెతుకులాట వెల్లువల మధ్య జిల్లా రాజకీయాలు మరిన్ని మలుపులు తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గోడ దూకడాలు కనిపిస్తాయి. కొత్త వ్యక్తులు, కొత్త శక్తులు ముందుకొచ్చే పరిస్థితి రావచ్చు.
- సత్తారు భాస్కరరావు










