ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం, పార్టీలు ప్రశ్నించాలి
ప్రజాశక్తి-ఉక్కునగరం : ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరిస్తున్న బిజెపి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం, రాజకీయ పార్టీల నాయకులు ప్రశ్నించాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డిమాండ్‌చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం నాటికి 581వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్ ట్రాఫిక్ విభాగ కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షలనుద్దేశించి పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్, ఎన్.రామారావు, వరసాల శ్రీనివాసరావు, వై.మస్తానప్ప, జె.రామకృష్ణ, సిహెచ్.సన్యాసిరావు, గుమ్మడి నరేంద్ర, దాసరి శ్రీనివాస్ మాట్లాడారు. ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసి కోట్లాది మందిని నిరుద్యోగులుగా రోడ్డునపడేట్టు చేస్తున్న బిజెపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. రాష్ట్రంలో ఓడరేవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారులు, అనేక ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను ఒక్కొక్కటిగా కాజేయాలని కేంద్రం కుట్రలు చేస్తుంటే రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు వ్యతిరేకించక పోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్రం సంపదను కోల్పోయిన తర్వాత ఎవరి కోసం రాజకీయాలు నడుపుతారని ప్రశ్నించారు. ఇద్దరు ముగ్గురు గుజరాతీ కార్పొరేట్లను ప్రపంచ కుబేరులుగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం బరితెగించి దేశ సంపదను దోచి పెడుతుంటే వాటిపై ప్రశ్నించకుండా వారికే మద్దతు పలకడానికి మన నాయకులు ఎగబడటం ప్రజలను వంచించడం కాదా అని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసే వరకు ఉద్యమాలను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ దీక్షా శిబిరంలో కాశి రమణ, జి.శ్రీనివాసరావు, అరుణ్‌నాథ్, రామన్న తదితరులు పాల్గొన్నారు.










