Jun 23,2023 23:49

మాట్లాడుతున్న కొమ్మినేని శ్రీనివాసరావు

ప్రజాశక్తి-తెనాలి : రాష్ట్రంలో జరగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని పక్కన బెట్టి ప్రభుత్వంపై ప్రజల్లో కృత్రిమ వ్యతిరేకత సృష్టించే పనిలో ప్రతిపక్షం నిమగమైందని ఏపీ ప్రెస్‌ అకాడమి చైర్మన్‌ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు. అవర్‌ స్టేట్‌ అవర్‌ లీడల్‌, వైఎస్సార్‌ ఇంటలెక్చువల్‌ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం కొత్తపేటలోని పెన్షనర్స్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో 'సుపరిపాలన దిశగా ఆంధ్రప్రదేశ్‌ రూపాంతరం' పేరుతో చర్చా వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి అవర్‌ స్టేట్‌ అవర్‌ లీడల్‌ సంస్థ సభ్యులు కె.జయశంకర్‌ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన కొమ్మినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ వైసిపి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 98శాతం హామీలను నెరవేర్చిందన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రీ చేపట్టని సంస్కరణలు, సంక్షేమానికి జగన్‌ శ్రీకారం చుట్టారని కొనియాడారు. విద్య, వైద్యం, ఉపాది కల్పనలో రాష్ట్రం ముందంజలో ఉందని, ఇవన్నీ పక్కనబెట్టి ఏపీలో జరగరానిది జరిగిపోతుందని కొన్ని ప్రతిపక్ష అనుకూల మీడియాలు ఏకరువు పెడుతున్నాయని విమర్శించారు. ప్రతిపక్షాల విమర్శల్లో వాస్తవాలను ప్రజలు గమనించాలన్నారు. ఏపీ తెలుగు-సంస్కృతం అకాడమి చైర్‌పర్సన్‌ ఎన్‌.లక్ష్మీపార్వతి మాట్లాడుతూ అధికారంలో ఉండగా చంద్రబాబు విర్రవీగారని, చెప్పనలవి కాని అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. చంద్రబాబు లాంటి నీఛ సంస్కృతి కలిగిన వ్యక్తులు రాష్ట్రానికే అరిష్టమని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపంచే నాయకులు జగన్‌ ఒక్కరేనని, ఆయనకు ప్రజలు అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.జాన్‌బాబు, అవర్‌ స్టేట్‌ అవర్‌ లీడర్‌ ఫౌండర్‌ శాంతమూర్తి, సభ్యులు డాక్టర్‌ కారుమంచి రవికుమార్‌ మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పలువురు అడిగిన ప్రశ్నలకు వక్తలు సమాధానమిచ్చారు. కార్యక్రమంలో మహేష్‌రెడ్డి, అడపాల నాగేశ్వరరావు పాల్గొన్నారు.