విఒఎల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి
విజయవంతంగా 36 గంటల ధర్నా
ఉద్యోగులకు ఎంఎల్‌సి షేక్ సాబ్జీ సంపూర్ణ మద్దతు
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
వెలుగు విఒఎ, మెప్మా ఆర్‌పిల సమస్యలను సిఎం జగన్ ప్రభుత్వం పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపడతామని వెలుగు విఒఎ యానిమేటర్ల సంఘం (సిఐటియు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ధనలక్ష్మి హెచ్చరించారు. 36 గంటల ధర్నాలో భాగంగా రెండో రోజు ధర్నాలో ఎంఎల్‌సి షేక్ సాబ్జీ పాల్గొని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. శాసనమండలిలో సమస్యలు ప్రస్తావించి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెప్పారు. మహిళలు 36 గంటలుగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలు వద్ద ఆందోళన చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూడడం అన్యాయమన్నారు. అనంతరం ధనలక్ష్మి మాట్లాడుతూ విఒఎ, ఆర్‌పిలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పొదుపు సంఘాలకు అనేక ప్రభుత్వ పథకాలందిస్తున్నా కనీస వేతనాలు లేవని, ప్రస్తుతం ఇస్తున్న రూ.ఎనిమిది వేలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో కూడా వేయడంలేదని ఆమె తెలిపారు. విఒఎలకు మహిళా మార్టులు పెట్టి సంఘాలకు కోళ్లు, గొర్రెలు, మేకలు, గేదెల యూనిట్లు అందించాలనే పేరుతో టార్గెట్లు పెట్టి వేధిస్తున్నారని విమర్శించారు. సిఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు భిన్నంగా కాల పరిమితి సర్క్యులర్ తీసుకువచ్చి ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఈ శిబిరం వద్దకు డిఆర్‌డిఎ పీడీ వచ్చి వినతిపత్రం స్వీకరించారు. తన పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని మిగిలిన అంశాలను ప్రభుత్వానికి నివేదిక పంపుతామని హామీ ఇచ్చారు.
ఈ ధర్నాలో సిఐటియు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆర్.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్, యూనియన్ జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సుభాషిణి, వివిధ సంఘాల నాయకులు ఎం.నాగమణి, ఫ్రాన్సిస్, లెనిన్ ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా నాయకులు మేరీ, ఆమని, ఆదిలక్ష్మి, మహాలక్ష్మి, నీరజ, కృష్ణకుమారి, కిరణ్మయి, వెంకటలక్ష్మి, జగదాంబ, వి.సాయిబాబు, గోపి, బి.జగన్నాధం నాయకత్వం వహించారు.










