Apr 29,2023 22:49

కాకినాడలో ధర్నా చేస్తున్నఎపి జెఎసి నాయకులు



- అమరావతి ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌ పితాని త్రినాథ్‌
ప్రజాశక్తి - కాకినాడ ప్రతినిధి
ఒకటో తేదీకల్లా జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని, బకాయి ఉన్న డిఎలు మంజూరు చేయాలని, కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ కింద రెగ్యులర్‌ చేయాలని, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వార్షిక ఇంక్రిమెంట్‌ మంజూరు చేయాలని, సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేసే వరకూ దశల వారీగా పోరాటాలు కొనసాగిస్తామని అమరావతి ఎపి జెఎసి జిల్లా చైర్మన్‌ పితాని త్రినాథ్‌ అన్నారు. రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం కాకినాడ ధర్నా చౌక్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పెద్ద ఎత్తున పాల్గొని ఆందోళ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రినాథ్‌ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్య వైఖరి అవలంభిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని స్పహ లేకపోవడం శోచనీయమన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతుంటే నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం తగదన్నారు. ఈ మేరకు డిమాండ్ల సాధనకు చివర వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎపి జెఎసి జిల్లా కార్యదర్శి ప్రసాద్‌, ముఖ్య అతిథిగా రాష్ట్ర డ్రైవర్స్‌ అసోసియోయేషన్‌ అధ్యక్షులు సంసాని శ్రీనివాస్‌, పెన్షనర్స్‌ అస్సోసియేషన్‌ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు పద్మనాభం, శాస్త్రి, విఆర్‌ఒ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిన్న, కో ఆపరేటివ్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గాప్రసాద్‌, ఆర్‌టిసి యూనియన్‌ జిల్లా నాయకులు సత్యానంద్‌ తదితరులు పాల్గొన్నారు.