Nov 14,2023 23:15

మాట్లాడుతున్న ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు ఆర్‌కె పురుషోత్తం


ప్రజాశక్తి - ఎడ్యుకేషన్‌ : రాష్ట్రంలో క్రీడలకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు మెరుగుపడాలంటే జాతీయ క్రీడల నిర్వహణతోనే అది సాధ్యపడుతుందని ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘం (ఎపిఓఏ) అధ్యక్షుడు ఆర్‌కె పురుషోత్తం పేర్కొన్నారు. జాతీయ క్రీడలు నిర్వహించే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయల నిధులను ఒలింపిక్‌ సంఘం ద్వారా మంజూరు చేస్తుందన్నారు. 2027లో జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘంతో (ఎపిఓఏ)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడిగా భారత ఒలింపిక్‌ సంఘంతో (ఐఓఎ)తో పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల గోవాలో ముగిసిన జాతీయ క్రీడలలో రాష్ట్ర క్రీడాకారులు 11 క్రీడాంశాలలో పాల్గొని ఏడు బంగారు, ఐదు రజత, 15 కాంస్య పతకాలతో కలిపి 27 పతకాలు సాధించి దేశంలోనే 19వ స్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ క్రీడల రాష్ట్ర చెఫ్‌ డి మిషన్‌ వైవి శివకుమార్‌, ఎపిఓఏ సీనియర్‌ ఉపాధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మీజీరావుతో కలసి పురుషోత్తం విలేకరులతో మాట్లాడారు. జాతీయ క్రీడల నిర్వహణకు రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతితోపాటు కాకినాడ నగరాలలో అవుట్‌ డోర్‌, ఇండోర్‌ స్టేడియాలు, స్విమ్మింగ్‌ పూల్స్‌, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇందుకోసం సుమారు రూ.5 వేల కోట్ల నిధుల అవరసం ఉందని చెప్పారు. గోవా నేషనల్‌ గేమ్స్‌కు అతి చిన్న రాష్ట్రమైన మేఘాలయ నుంచి సుమారు 560 మంది క్రీడాకారులు ప్రత్యేకంగా విమానంలో వచ్చారన్నారు. అలాగే మణిపూర్‌, మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల జట్లుసైతం విమానాలలో రాగా, ఎపి క్రీడాకారులు రైలు జనరల్‌ కంపార్ట్‌మెంట్‌లో పోటీలకు హాజరుకావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడమే ఇందుకు కారణమని ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. జాతీయ క్రీడల చీఫ్‌ డి మిషన్‌ వైవి శివకుమార్‌ మాట్లాడుతూ, సరైన కోచింగ్‌ లేకపోవడంతో రాష్ట్రం 27 పతకాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందన్నారు.