Aug 12,2023 22:21

సమస్యలపై వినతిని ఇస్తున్న నాయకులు

        హిందూపురం : రాష్ట్రంలో ఉన్న ప్రయివేటు, ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ సమస్యలన్నీ ప్రభుత్వం దష్టికి తీసుకెళ్లి, వాటిని పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తామని ఏపీ ప్రయివేటు ఎలక్ట్రికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పాల్‌ రాజ్‌, ప్రధాన కార్యదర్శి హరిరావు, కార్యదర్శి మాదన్నలు పేర్కొన్నారు. శనివారం నాడు ప్రయివేటు ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక నాయకులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి, వినతిని ఇచ్చారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులతో పాటు ప్రయివేటు ఎలక్ట్రికల్‌ కార్మికులకు కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాలా సదుపాయాలు కల్పించే విధంగా కషి చేస్తామన్నారు. ప్రయివేటు ఎలక్ట్రికల్‌ కార్మికుల వత్తికి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం రూ.2లక్షలు సబ్సిడీతో రుణ సదుపాయం కల్పించాలన్నారు. పనులు చేస్తూ ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 10 లక్షలు నష్టపరిహారం అందించాలన్నారు. ప్రతి మండలానికి ఎలక్ట్రికల్‌ సర్వీస్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తూ కార్మికులకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రయివేటు ఎలక్ట్రికల్‌ కార్మికుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి ఎలక్ట్రికల్‌ డే నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఈసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రయివేటు ఎలక్ట్రికల్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ ఎం.లక్ష్మీనారాయణ, కార్యదర్శి సుధాకర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ నసురుల్లా, కార్యదర్శి ఏజాజ్‌, మాజీ ప్రెసిడెంట్‌ జిలాన్‌ పాల్గొన్నారు.