ప్రజాశక్తి-బాపట్ల రూరల్: కౌలు రైతు హక్కు పత్రాల మంజూరుకు ప్రభుత్వం చొరవ చూపాలని కౌలు రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు రాధాకృష్ణ, సిపిఎం బాపట్ల జిల్లా కార్యదర్శి సిహెచ్.గంగయ్య డిమాండ్ చేశారు. సోమ వారం బాపట్ల మండలం, చుండూరుపల్లి గ్రామంలో ఇటీవల సతీష్ అనే రైతుపై దాడి జరిగింది. ఈ నేపథ్యంలో సతీష్ కుటుంబ సభ్యులను నాయకులు పరామర్శించారు. అనంతరం గ్రామంలోని కౌలురైతులతో మాట్లాడారు. రైతుకు ప్రభుత్వం ద్వారా వచ్చే అన్ని పథకాలూ అందాలన్నారు. కౌలు రైతుకు గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కౌలు రైతు కార్డులు మంజూరు విషయంలో ప్రభుత్వ అధికారులు చొరవ చూపి భూ యజమానితో మాట్లాడి ఒప్పించాలన్నారు. కౌలు రైతు దరఖాస్తుపై భూ యజమాని సంతకం చేయాలనే నిబంధన తీసేయాలని డిమాండ్ చేశారు. కౌలుదారు కార్డు ద్వారా పంట రుణాలు పొందే అవకాశం ఉందన్నారు. కార్డు లేకుంటే రుణం పొందే అవకాశం పోతుందని, దీని వల్ల పంటకు పెట్టుబడి అందకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకుడు రాకేష్, రైతులు పాల్గొన్నారు.










