
ప్రజాశక్తి-యలమంచిలి రూరల్ : ఎలమంచిలి ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన పరికరాలను గురువారం ఎమ్మెల్యే యువి. రమణమూర్తిరాజు ప్రారంభించారు. ఆసుపత్రిలో ఆధునిక పరికరాలు లేక రోగుల ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే తోయెత్సు రేర్ ఎర్త్ లిమిటెడ్ కంపెనీని కోరి వెంటనే సిఎస్‌ఆర్ నిధులతో అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్, ఆటోమేటిక్ పరికరాలను 16 లక్షలతో కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా కన్నబాబురాజు మాట్లాడుతూ ఎలమంచిలి మండల పరిధిలో జాతీయ రహదారి సుమారు 20 కిలోమీటర్లు మేరా ఉండటం వలన ఏ ప్రమాదం జరిగిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి వచ్చిన రోగులకు ఆర్థోపెడిక్ పరికరాలు లేక అనకాపల్లి, విశాఖపట్నం కు రిఫర్ చేయాల్సి వచ్చేదని తెలిపారు. ఈ క్రమంలో మార్గమధ్యలో ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుందని, రోగుల ఇబ్బందుల దృష్టిలో పెట్టుకొని ఈ పరికరాలు ఏర్పాటు చేసేందుకు కంపెనీ వారి సహకారం కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ సుకుమార్ వర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ రమాకుమారి, మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి, వైసీపీ నాయకులు బెజవాడ నాగేశ్వరరావు, ఆరెపు గుప్త, బొద్ధపు ఎర్రయ్య దొర, డాక్టర్ సురేఖ, జయకర్, నిహారిక లు పాల్గొన్నారు.