
ప్రజాశక్తి - భీమవరం రూరల్
రాష్ట్రంలో ప్రజారోగ్యానికి వైసిపి ప్రభుత్వం పెద్దపీట వేసిందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎంఎల్‌ఎ గ్రంధి శ్రీనివాస్ అన్నారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన మహిళలకు కేన్సర్ పరీక్ష కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో మాత్రమే మహిళలకు కేన్సర్ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కేంద్రంలో మహిళలకు కేన్సర్ పరీక్షలు చేసి రోగ నిర్ధారణకు చర్యలు తీసుకుంటారన్నారు. ఎపి ఎస్‌ఎసిఎస్‌ఎన్‌హెచ్‌ఎం, సిడిసి, షేర్‌ఇండియా ఆధ్వర్యంలో ఈ కేంద్రం నడుస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మంజూరు చేయించి ఆసుపత్రి నిర్మాణానికి తమ కుటుంబం నాలుగు ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇచ్చినట్లు చెప్పారు. వంద పడకల ఆసుపత్రి ప్రజా వినియోగంలోకి వచ్చిన వెంటనే, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాసుపత్రిని తల్లీబిడ్డల ఆసుపత్రిగా మార్చనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరాస్వామి, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు కొప్పర్తి వీరరాఘవులు, పేరిచర్ల సత్యనారాయణరాజు, డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ గోవిందబాబు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ విజరు, డాక్టర్ సిహెచ్.నాయుడు, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.