Sep 06,2023 19:33

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పేదలకు నాణ్యమైన వైద్య అందించడం, ఆరోగ్య వంతమైన సమాజ నిర్మాణం కోసం ప్రభుత్వం పాటుపడుతోందని ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం వైద్య రంగంలో ఎన్నో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. నరసరావుపేటలోని పల్నాడు రోడ్డులోగల ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌లో డయాలసిస్‌ యూనిట్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.45 లక్షలతో 5 డయాలసిస్‌ యూనిట్‌, రెండు సర్జికల్‌ యూనిట్లు నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు, పట్టణానికి చెందిన ప్రస్తుతం అమెరికాలో ప్రముఖ కిడ్నీ వైద్యులుగా ఉన్న డాక్టర్‌ సాగిరెడ్డి పురుషోత్తంబాబురెడ్డి సహకారంతో ఏర్పాటు చేశామన్నారు. గతంలో డయాలసిస్‌ పేషెంట్లు గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు వ్యయప్రయసాలతో వెళ్లాల్సి ఉండేదని, ఇకమీదట ఇక్కడే ఆ సేవలు పొందొచ్చని చెప్పారు. పల్నాడు జిల్లా మాచర్ల, వినుకొండ, పిడుగురాళ్ల పలు దూర ప్రాంతాల వారు ఈ సేవలను పొందాలన్నారు. రూ.57 కోట్లతో నాబార్డ్‌ సంస్థ ద్వారా నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు మరో 250 పడకలకు నిర్మాణం కోసం టెండర్లు పిలవనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో దాతలు కిడ్నీ వైద్యులు డాక్టర్‌ సాగిరెడ్డి పురుషోత్తం బాబు రెడ్డి, ఆయన కుమారుడు శ్రీకాంత్‌ రెడ్డి, రోటరీ క్లబ్‌ అధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, రోటరీ సభ్యులు, ఏరియా హాస్పిటల్‌ వైద్యులు, వైసిపి నాయకులు వివిధ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోగులకు అన్నదానం చేశారు.