ప్రజాశక్తి - పల్నాడుజిల్లా కరస్పాండెంట్ : పట్టణం సమీపంలోని లింగంగుంట జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకుగాను రూ.57 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. మరో 200 పడకలతో విస్తరణ, తల్లీపిల్లల ప్రత్యేక విభాగం, ఎంఆర్‌ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆస్పఇ ప్రాంగణంలోని 4 ఎకరాల స్థలాన్ని సూపరింటెండెంట్, ఎపిఎంఎస్‌ఐడిసి అధికారులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. 200 పడకలతో ఆస్పత్రిని ప్రారంభించామని, 25 మంది వైద్య సిబ్బంది, 1500 మంది వైద్య విద్యార్థులను నియమించినట్లు చెప్పారు. 700-1500 ఓపీలతో, 250 మంది ఇన్‌పేషెంట్లతో ఆస్పత్రి నడుస్తోందని చెప్పారు. నూతన విస్తరణలో మరో 200 పడకలు, పాత ప్రభుత్వ హాస్పటల్ లో 100 పడకలతో జిల్లాకేంద్రంలో ప్రభుత్వ హాస్పటల్లో మొత్తం 500 పడకలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డాక్టర్ శేషిరెడ్డి, డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ రైతులకు విత్తనాలు పంపిణీ
ఎస్సీ, ఎస్టీ రైతులకు మిర్చి, ఇతర కూరగాయల విత్తనాలను కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఎల్.శివశంకర్ మంగళవారం అందించారు. కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'మిరప పంటలో మెరుగైన వ్యవసాయ పద్ధతులపై శిక్షణ'లో భాగంగా వీటిని పంపిణీ చేశారు. భారతీయ ఉద్యాన పరిశోధనా సంస్థ (ఐఐహెచ్‌ఆర్) అభివృద్ధి చేసిన మిరప విత్తనాలు, ఇతర కూరగాయలతో కూడిన కిట్టును అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మిర్చి సాగు విస్తీర్ణం 1.25 లక్షల ఎకరాల నుండి 1.75 లక్షల ఎకరాలకు పెరగనుందని, అందుకు తగ్గట్టు విత్తన సేకరణ, పంపిణీకి సిద్ధంగా ఉన్నామని అన్నారు. నేల స్వభావానికి అనుకూలంగా వుండే పంటల సాగుతోపాటు నేల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు పంట మార్పిడి చేయాలని సూచించారు. విత్తన దుకాణాల్లో తనిఖీలు చేస్తున్నామని, ఇవింకా ముమ్మరం అవుతాయని చెప్పారు. ప్రతి సోమవారం 'రైతుకు వందనం' అనే కార్యక్రమం ద్వారా నియోజకవర్గానికి ఒక ఆదర్శ రైతును ఎంపిక చేసి, వారి విజయ గాథలు అధికారులు, తోటి రైతులకు తెలియజేస్తున్నామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత రెండు సీజన్లుగా మిర్చి పంట దిగుబడి తగ్గుదలకు కారణమవుతున్న తామర పురుగుపై ఐఐహెచ్‌ఆర్ విత్తనాలతో విజయం సాధించి రైతులంతా మంచి లాభాలు ఆర్జించాలని ఆకాంక్షించారు. ఉద్యాన రైతులకు డ్రోన్లను ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖాధికారి బెన్నీ, జిల్లా వ్యవసాయ అధికారి మురళి, ఐఐహెచ్‌ఆర్ శాస్త్రవేత్తలు శ్రీధర్, నరేశ్, జయంతి మాల పాల్గొన్నారు.










