
ప్రజాశక్తి-గుంటూరు : వైసిపి ప్రభుత్వానికి ప్రజలు షాక్ ఇచ్చే సమయం ఆసన్నమైందని సిపిఎం, సిపిఐ నగర కార్యదర్శులు కె.నళినీకాంత్, కె.మాల్యాద్రి అన్నారు. ప్రజలపై మోసిన విద్యుత్ చార్జీల భారాన్ని వ్యతిరేకిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం శంకర్‌విలాస్ సెంటర్, కొరిటపాడు పార్కు వద్ద ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. రాష్ట్రంలో 30 ఏళ్లపాటు వ్యవసాయానికి విద్యుత్ అందించే ఒప్పందం అదానీతో చేసుకున్నారని, విదేశాల నుండి బొగ్గు సరఫరా చేసే ఓడరేవులూ అదానీవేనని, తాజాగా విద్యుత్ స్మార్ట్ మీటర్ల తయారీ కంపెనీ కూడా అదానీ ప్రారంభించాడని అన్నారు. విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు కేంద్రం యత్నిస్తోందని చెప్పటానికి ఇవే ఉదాహరణలన్నారు. రెండు మూడు రూపాయాలకు కొనాల్సిన యూనిట్ విద్యుత్‌ను బహిరంగ మార్కెట్లో రూ.10 నుండి రూ.20కు కొంటున్నారన్నారు. ఇందులో భారీగా అవినితి చోటు చేసుకుందని, పైగా పెరిగిన విద్యుత్ భారాన్ని ప్రజలపై మోపుతున్నారని మండిపడ్డారు. ఇటీవల హిందూజా సంస్థలకు నిబంధనలకు విరుద్ధంగా రూ.1200 కోట్ల అప్పనంగా చెల్లించారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఇస్తున్న ఉచిత విద్యుత్‌ను నీరుగారుస్తున్నారని విమర్శించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే గతప్రభుత్వాలకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు వి.రాధాకృష్ణమూర్తి, కె.రంగారెడ్డి, మురళి, ఎన్.చిన్న, సిపిఎం నాయకులు షేక్ ఖాసింషహీద్, ఆది నికల్సన్, కార్తీక్, ఖాసింవలి పాల్గొన్నారు.
ప్రజాశక్తి - నరసరావుపేట :పట్టణంలోని గాంధీ పార్క్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ప్రజాబ్యాలెట్ నిర్వహించారు. ప్రజలు విరివిగా పాల్గొని ఛార్జీలకు వ్యతిరేకంగా ఓటేశారని సిపిఐ పల్నాడు జిల్లా సహాయ కార్యదర్శి కె.రాంబాబు తెలిపారు. టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు, నాయకులు కె.బ్రహ్మయ్య, వి.రవి, న్యాయవాది సీజే ప్రతాప్ హాజర య్యారు. సిపిఐ పట్టణ కార్యదర్శి వి.వెంకట్, నాయకులు యు.రంగయ్య, డి.వరహాలు, సైదా, వెంకటేశ్వర్లు, ఏసు, నాగేశ్వరావు, అప్పారావు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.