Jun 29,2021 06:53

   రుసగా మూడవ ఏట పోలవరం నిర్వాసితుల ముంపు ముమ్మాటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సృష్టించిన దారుణ విపత్తు. ప్రాజెక్టు నిర్మాణం మొదలై దశాబ్దన్నర దాటినా ప్రాజెక్టు కోసం భూములు, ఇళ్లూ, వాకిళ్లు సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు, తాము ఇస్తామన్న పునరావాసాన్ని గాలికొదిలేసి ప్రాజెక్టు నిర్మాణాన్నే తలకెత్తుకున్న ప్రభుత్వాల అమానవీయత. ప్రధాన ప్రాజెక్టు నిర్మాణం కోసం ఎగువన గోదావరి నీటిని నిలబెట్టేందుకు కట్టిన కాఫర్‌ డ్యాం వద్ద బ్యాక్‌ వాటర్‌ నదికి కొద్దిపాటి వరదొచ్చినా ఏజెన్సీ గ్రామాలను ముంచెత్తి వేలాది గిరిజనులను నిరాశ్రయులను చేస్తోంది. ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్‌, ఒరిస్సా రాష్ట్రాల్లో కురిసిన వానలతో కొద్దిపాటి వరదనీరు కాఫర్‌ డ్యాం వద్దకు వచ్చిందో లేదో రంపచోడవరం, ఏటిపాక రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 65 గ్రామాలు నీట మునిగాయి. వరద పెరిగితే మరిన్ని ఆవాసాలు మునుగుతాయని గిరిజనులు భీతిల్లుతున్నారు. వరదొచ్చినప్పుడు అప్పటికప్పుడు తాత్కాలిక పునరావాస కేంద్రాలకు జనాన్ని తరలించడం అనంతరం అటు వైపు కన్నెత్తి చూడక పోవడం ప్రభుత్వాలకు అలవాటైంది. శాశ్వత ప్రాతిపదికన నిర్వాసితులకు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, వాగ్దానం చేసిన విధంగా పునరావాస, రీసెటిల్‌మెంట్‌ (ఆర్‌ అండ్‌ ఆర్‌) ప్యాకేజీ అమలుపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం పాటించడం చూస్తే ప్రభుత్వానికి నిర్వాసితుల ప్రాణాలు, జీవితాలు అంటే ఎంత చిన్న చూపో తెలియజేస్తోంది. పోలవరం నిర్వాసితుల్లో అత్యధికం ఏజెన్సీ గిరిజనులే.
    విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని అందరూ చెబుతున్నారు. జాతి నిర్మాణం కోసం ప్రాజెక్టుకు భూములిచ్చి నిరాశ్రయులైన త్యాగధనులకు న్యాయం చేసే విషయంలో నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరిస్తున్నారు పాలకులు. పోలవరం కింద 373 జనావాసాలు, లక్షకుపైన జనాభా, లక్షన్నర ఎకరాలకుపైన పంట భూములు మునుగుతున్నాయి. ఏ ప్రాజెక్టునూ గాలిలో నిర్మించరు కనుక భూములు, నివాసాలు కోల్పోయిన నిర్వాసితులను ఆదుకోవాల్సింది ప్రభుత్వాలే. విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా ఇచ్చాక ఆ బాధ్యతకు కచ్చితంగా కేంద్రమే పూచీ పడాలి. కానీ నిర్వాసితుల పునరావాసం బాధ్యత తమది కాదంటోంది బిజెపి సర్కారు. గతంలో టిడిపి కానీ ప్రస్తుత వైసిపి కానీ కేంద్రం చేస్తున్న దగాపై గొంతెత్తి నిలదీయకుండా వినతిపత్రాలతో కాలక్షేపం చేస్తున్నాయి. కోల్పోయిన భూమికి బదులు ప్రాజెక్టు దిగువన భూమిని ఇస్తామన్న రాజశేఖరరెడ్డి హామీ ఏనాడో గాల్లో కలిసిపోయింది. ప్రాజెక్టు నిర్మాణాలను మాత్రం కొనసాగిస్తున్నాయి. ఈ ధోరణి కాంట్రాక్టులతో లబ్ధి పొందాలనే రందిని సూచిస్తున్నదే తప్ప నిర్వాసితులను ఆదుకోవాలని ఏ కోశానా లేదని అర్థమవుతుంది. కేంద్రం పార్లమెంట్‌లో చేసిన ప్రకటనల ప్రకారమే మూడు శాతానికే ఆర్‌ అండ్‌ ఆర్‌ అమలు చేశారు. అందరికీ అమలు చేయాలంటే ఇంకెన్నేళ్లు పడుతుంది? ప్రభుత్వం నిర్మాణాలు చేస్తుంటే నిర్వాసితులు ముంపులో బతకాల్సిందేనా?
    టిడిపి కంటే ఎక్కువ ప్యాకేజీ ఇస్తామన్న వైసిపి తానిచ్చిన వాగ్దానంపై కంటే నిర్మాణాలపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఆర్‌ అండ్‌ ఆర్‌ ఇవ్వకుండా నిర్వాసితులను బలవంతంగా ఖాళీ చేయించేందుకు హడావిడి చేస్తోంది. గోదావరి ట్రిబ్యునల్‌ గతంలో ఆమోదించిన ప్రకారం నిర్ణీత 45 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్‌ నిర్మించి, 41 అడుగుల మేరకే నీరు నిలబెట్టి నిర్వాసితుల ఖర్చును తగ్గించుకోవాలని చూస్తున్నట్లు వస్తున్న వదంతులపై ప్రభుత్వం నుండి స్పష్టత లేదు. ఆ పని చేసే బదులు ప్రాజెక్టు వ్యయం రూ.55 వేల కోట్ల అంచనాలకు కేంద్రం వద్ద ఆమోదం సాధిస్తే, నిర్వాసితులకు రూ.33 వేల కోట్లు ఖర్చు చేయవచ్చు. ఈ ఆలోచన వైసిపి చేయకుండా అటు రాష్ట్ర విస్తృత ప్రయోజనాలకు ఇటు లక్ష మంది ఆదీవాసీల పునరావాసానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తోంది. ఒక్క పోలవరమే కాదు వంశధార కింద 35 వేల మంది, వెలుగోడు, వెలిగొండ, గండికోట, పులిచింతల... చెప్పుకుంటూ పోతే ప్రాజెక్టుల కింద పునరావాసం అందక లక్షల మంది 'అలో..లక్ష్మణా...' అంటున్నారు. నిర్వాసితులకు పునరావాస పరిహారం భిక్ష కాదు. చట్టబద్ధతతో కూడిన న్యాయమైన హక్కు. చివరి నిర్వాసితుని వరకు పూర్తి స్థాయిలో పునరావాసం అందించాకనే ప్రాజెక్టులు చేపట్టాలి. ఆర్‌ అండ్‌ ఆర్‌పై విన్యాసాలు చేసి పబ్బం గడపజూస్తున్న ప్రభుత్వాల మెడలను నిర్వాసితులు తమ పోరాటాలతో వంచాలి.