Apr 16,2021 06:44

పెద్ద సంఖ్యలో ప్రజలు గుమికూడటం ఎంత ప్రమాదమో తెలిసినా కుంభమేళాకు కేంద్రం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించడమేగాక భారీ ప్రకటనలు ఇచ్చి భక్తులను ఆహ్వానించడం బాధ్యతా రాహిత్యం. కుంభమేళాలో మాస్కులు, శానిటైజర్ల వినియోగం నామమాత్రం. భౌతికదూరం పాటించడం ఇటువంటి చోట్ల అసాధ్యం. అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర నేతలు కూడా ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పట్టించుకోవడం లేదు. 'కుంభమేళా పవిత్ర గంగా నది ఘాట్‌లలో, బహిరంగ ప్రదేశంలో జరుగుతోంది. ఇక్కడ కరోనా రాదు.' అని మూఢ నమ్మకాలు మరింత పెరిగేలా ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరధ్‌ సింగ్‌ వ్యాఖ్యానించడం దారుణం. పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్న యాత్రికులు దేశం నలుమూలలకు వెళ్లి వైరస్‌ను వ్యాపింపచేస్తే అందుకు బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది కాదా? కోవిడ్‌ ఇంతలా విజృంభిస్తున్నా కుంభమేళా మొదట ప్రకటించిన విధంగానే ఈ నెల 30 వరకు కొనసాగుతుందని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం తాజాగా ప్రకటించడం అమానుషం.


తగిన సంఖ్యలో వ్యాక్సిన్‌ కేటాయించలేదంటూ మహారాష్ట్రతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాసినా స్పందన నామమాత్రంగా ఉంది. దేశంలో టీకా కొరత వెంటాడుతుంటే 80 దేశాలకు వ్యాక్సిన్‌ పంపామని ప్రధాని గొప్పగా చెప్పడం 'ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత'లా ఉంది. వైద్య సేవలు అందించడంతోబాటు ప్రజల బాగోగులు చూడవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలకు మెండుగా వున్న స్థితిలో కేంద్రం వాటికి తగిన నిధులను కేటాయించకపోవడం భావ్యం కాదు. సిబిఎస్‌ఇతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు పది పరీక్షలను రద్దు చేసి ప్లస్‌ టు వాయిదా వేస్తున్నాయి. కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు రీ షెడ్యూల్‌ చేయగా ఆంధ్రప్రదేశ్‌ విద్యామంత్రి పరీక్షలు యథాతథం అంటున్నారు. ఆయా రాష్ట్రాల విద్యార్థుల సన్నద్ధత, కోవిడ్‌ నిబంధనలను పటిష్టంగా అమలు చేయడంలో ప్రభుత్వాల నిబద్ధతనుబట్టి పరీక్షలు నిర్వహించడం లేదా వాయిదా లేదంటే రద్దు చేయాలి. అన్ని స్థాయిల పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వాలు సమగ్ర దృక్పథంతో వ్యవహరించడం అవసరం.


కొత్త కేసుల సంఖ్య దేశంలో రెండు లక్షలు దాటగా రాష్ట్రంలో ఐదు వేలు మించిపోయాయి. మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరం. పరిస్థితిని ఆసరా చేసుకొని ప్రైవేటు ఆసుపత్రులు రోగులనుండి లక్షల రూపాయలు గుంజుతుండగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీ లేవన్న ప్రకటనలు రావడం బాధాకరం. ఫోన్‌ వచ్చిన మూడు గంటల్లో బెడ్‌ చూపించాలని కోవిడ్‌ సమీక్షలో సి.ఎం జగన్‌ మోహన్‌ రెడ్డి అధికార్లను ఆదేశించడం బాగానేవుంది కానీ అందుకుతగ్గ మౌలిక వసతులు, వైద్య, పారామెడికల్‌ సిబ్బంది అందుబాటులో ఉన్నారా అన్నది సందేహాస్పదమే! యుద్ధ ప్రాతిపదికపై వైద్య సౌకర్యాల కల్పన జరగాలి. రాష్ట్రంలో బుధవారం ఒక్క రోజునే రికార్డు స్థాయిలో 6.37 లక్షల మందికి టీకా వేయడం అభినందనీయమే కానీ గురువారం ఆ సంఖ్య సుమారు 30 వేలకు పడిపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వ్యాక్సిన్‌ ఇవ్వకపోడం ముమ్మాటికీ కేంద్రం వైఫల్యమే అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ మాట చెప్పి ఊరుకోరాదు.


కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కుటుంబానికి రూ.7,500 నగదు, ఆహార ధాన్యాల పంపిణీతోపాటు ఉపాధి హామీ పనులు విస్తారంగా చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలి. గతంలో త్రిపుర వామపక్ష ప్రభుత్వం చేపట్టిన విధంగా ఇప్పుడు దేశమంతటా పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయడం అవసరం. వైద్య సదుపాయాలు, మందులు, సిబ్బందిని సమకూర్చడంపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరించాలి. 'టీకా ఉత్సవం' అని ఉత్తుత్తి మాటలు కాకుండా పెద్ద సంఖ్యలో వేసేందుకు నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అనుమతులు మంజూరు చేయడం, తగినంత ఉత్పత్తి, పంపిణీ దేశమంతటా జరిగేలా చూడడం కేంద్ర ప్రభుత్వ గురుతర బాధ్యత. క్షేత్ర స్థాయి కార్యాచరణ చేపట్టే రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన నిధులు కేటాయించాలి. 'పి.ఎం కేర్స్‌' డబ్బును రాష్ట్రాలకు బదలాయించడం కేంద్ర ప్రభుత్వ తక్షణ కర్తవ్యం.