Nov 30,2022 23:37

ప్రజాశక్తి-మైలవరం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాలతో రోజురోజుకూ ప్రజలపై భారాలు పెరిగిపోతున్నాయని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌ అన్నారు. సిఐటియు మైలవరం మండల నాల్గో మహాసభ బుధవారం స్థానిక సిఎంఆర్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగింది. ముందుగా మండల అధ్యక్షురాలు శారద, ఫ్రూట్స్‌ అండ్‌ హాకర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు వేముల శ్రీనివాసరావు సిఐటియు జెండాను ఆవిష్కరించారు. అంగన్‌వాడీ ప్రాజెక్టు అధ్యక్షురాలు ఆర్‌.పుష్పకుమారి సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన సభలో శ్రీనివాస్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయన్నారు. కార్మికుల ఉపాధి దెబ్బతిని ఇబ్బంది పడుతున్న కాలంలో ధరల భారం, పన్నుల భారాలను మోపాయన్నారు. లేబర్‌ కోడ్‌లు రద్దు అయ్యే వరకూ కార్మికులంతా ఐక్యంగా పోరాడాలన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నాయే తప్ప కార్మిక సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. అందరూ కలిసి సంఘాన్ని విస్తరించాలని, కార్మికుల సమస్యలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. డిసెంబర్‌ 15, 16 తేదీల్లో విజయవాడలో జరిగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. అనంతరం 15 మందితో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షురాలిగా ఆర్‌.ఆర్‌.వి పుష్పకుమారి, కార్యదర్శిగా సిహెచ్‌ సుధాకర్‌, ఉపాధ్యక్షులుగా వేముల శ్రీను, కోశాధికారిగా బి.శేషమ్మ, ఉపాధ్యక్షులుగా టి.నరసింహారావు, పత్తిపాటి జ్యోతి, దుర్గారావు, వీరమ్మ, మాణిక్యం, అనిల్‌కుమార్‌, షేక్‌ అబ్దుల్లా, విజయ, వెంకటేశ్వరరావులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సెక్రటరీ విజరు, ఎం.మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.