Mar 26,2023 23:48

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రాఘవులు

ప్రజాశక్తి -అనకాపల్లి : నూతన విద్య విధానం పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రాథమిక విద్యావ్యవస్థ పతనమవుతోందని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యదర్శి డివి రాఘవులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక గవరపాలెం మల్ల జగన్నాథం కల్యాణ మండపంలో ఆదివారం యుటిఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ ప్రథమ సమావేశం జరిగింది. ముందుగా యుటిఎఫ్‌ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ విద్యారంగంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న తిరోగమన చర్యలను రాష్ట్రంలో ఉపాధ్యాయులు నిత్య చైతన్యవంతులై ఉండి ఖండించాలన్నారు. సిపిఎస్‌ రద్దుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాల్సిందేనని,ప్రత్యామ్నాయం కాకుండా పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించడం విద్యా హక్కు చట్టానికి విరుద్ధమన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా కౌన్సిల్‌ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నూతన కార్యవర్గ ఎన్నిక
ఈ సందర్భంగా యుటిఎఫ్‌ అనకాపల్లి జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులుగా నెల్లి సుబ్బారావు, అధ్యక్షురాలిగా వత్సవాయి శ్రీలక్ష్మి, సహాధ్యక్షులుగా కట్ట శ్రీనివాసరావు, జివిపిఎస్‌ లక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా గొంది చిన్నబ్బాయి, కోశాధికారిగా జెవిఎన్‌పి రాజేష్‌, కార్యదర్శులుగా గుత్తల సూర్య ప్రకాష్‌, కాలింగ సతీష్‌, పొలిమేర చందర్రావు, దొగ్గా శ్రీనివాస్‌, వి రమేష్‌ బాబు, వి చైతన్య షీల, ఎన్‌ శేష్‌కుమార్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా అడిగర్ల శ్రీనివాస్‌, ఆడిట్‌ కమిటీ సభ్యులుగా కె.రామచంద్రరావు, జి శాంతిదేవి, కపిరెడ్డి శ్రీను, ఆర్‌.రవికుమార్‌ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ డిమాండ్ల సాధనకు యుటిఎఫ్‌ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వంపై నిరంతర పోరాటం చేస్తామన్నారు. ఉపాధ్యాయులంతా ఐక్యంగా కలిసి రావాలన్నారు. నూతన కమిటీని అభినందించారు.