Nov 06,2023 21:32

స్కూటర్‌యాత్రలో పాల్గొన్న సిపిఎం నాయకులు

        ప్రజాశక్తి-బుక్కరాయసముద్రం : ప్రభుత్వాలు, పాలకుల నిర్లక్ష్యంతోనే అనంతపురం జిల్లా అత్యంత వెనుకుబాటుకు గురవుతోందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ విమర్శించారు. జిల్లా సమగ్రాభివృద్ధి కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ భేరి స్కూటర్‌యాత్ర సోమవారం ప్రారంభం అయ్యింది. బుక్కరాయసముద్రం మండలంలో ప్రారంభం అయిన యాత్ర శింగనమల, నార్పల, పుట్లూరు, తాడిపత్రి, యాడికి, పెద్దవడుగూరు, పామిడి, గుత్తి, గుంతకల్లు వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో నాయకులు స్థానిక సమస్యలపై మాట్లాడారు. ఈ సందర్భంగా రాంభూపాల్‌ మాట్లాడుతూ అనంతపురం జిల్లా దశాబ్దాలుగా వెనుకబాటుకు గురైందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌, విభజిత రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అత్యంత వెనుకబడిన జిల్లాగా అనంతపురం ఉందన్నారు. జిల్లాకు ఉన్న ఏకైక సాగునీటి వనరు తుంగభద్ర హెచ్‌ఎల్‌సి కింద నిర్ణయించిన ఆయకట్టు భూములకు ఇప్పటి వరకూ ఏనాడు పూర్తిస్థాయిలో నీరు అందించిన దాఖలాలు లేవన్నారు. ఎడారిలో పండే కర్జూరాలు, మంచు ప్రాంతంలో పండే ఆపిల్‌, ఆధునికమైన డ్రాగాన్‌ ఫ్రూట్స్‌ పంటలను జిల్లా రైతులు పండిస్తున్నా పంటను ఎగుమతి చేసేందుకు అవసరమైన మార్కెట్‌ సౌకర్యంలేదన్నారు. 15 సంవత్సరాలుగా హంద్రీనీవా నీరు వస్తున్నా ఆయకట్టుకు నీరు ఇవ్వని పరిస్థితి నెలకొందన్నారు. వెయ్యి మందికి ఉపాధి చూపే ఒక్క పరిశ్రమ కూడా జిల్లాలో లేదన్నారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌, పీజీలు పూర్తిచేసిన వేలాదిమంది యువతీ, యువకులు పొట్టచేతబట్టుకుని ఇతర రాష్ట్రాలకు వలసపొతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని సూపర్‌ స్పెషాల్టీ, క్యాన్సర్‌ ఆసుపత్రుల నిర్వహణ పట్ల పాలకులు కనీస శ్రద్ధపెట్టడంలేదన్నారు. పేదలు ఇళ్ల స్థలాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారని చెప్పారు. ప్రభుత్వ భూములు, దేవాదాయ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుంటే అదేదో నేరం అన్నట్లుగా భావించి అధికారులు నిర్ధాక్షణంగా వాటిని కూల్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గార్లదిన్నె మండలం కల్లూరులో గ్రామంలో ఇటీవల చోటు చేసుకున్న పేదల గుడిసెల తొలగింపు అత్యంత దుర్మార్గమైనదన్నారు. ఇళ్లు కూల్చివేత సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు సభ్యసమాజం తలదించుకునేదిలా ఉందన్నారు. పేదలపై అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకునేందుకు జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలన్నారు. వర్షాభావం నేపథ్యంలో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల నష్టపరిహారం ఇవ్వాలన్నారు. హెచ్‌ఎల్‌సి, హంద్రీ-నీవా కాలువల కింద సాగుచేసిన పంటలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలన్నారు. పండ్ల తోటల ఆధారిత పరిశ్రమలను స్థాపించాలన్నారు. ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించి, రోజుకు 600 కూలి ఇవ్వాలన్నారు. పండ్ల తోటల ఆధారంగా జిల్లాలో మార్కెట్‌ సౌకర్యం, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేయాలన్నారు. పేద సాగు రైతులందరికీ వ్యవసాయ సాగు భూమి ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసి, ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. మున్సిపల్‌ పట్టణాల్లో చెత్త, ఇంటి పన్నులను రద్దు చేయాలన్నారు. జిల్లా అభివృద్ధికి మేధావులు, యువత, ప్రజాసంఘాల నాయకులు అనేక ప్రత్నామ్నాయ ప్రతిపాదనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకునే స్థితిలో లేదన్నారు. ఈ పరిస్థితుల్లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అక్టోబర్‌ 29న జిల్లాకు చెందిన ప్రముఖులతో ''జిల్లా సమగ్రాభివద్ధి- ప్రత్యామ్నాయ విధానాలు''పై సదస్సును నిర్వహించిందన్నారు. ఈ సదస్సు నిర్ణయించిన విధానాల అమలు కోసం ఉద్యమం తప్పా, వేరే మార్గంలేదన్నారు. అందులో భాగంగా ప్రజా చైతన్యం కోసం నవంబర్‌ 6 నుంచి 9వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో స్కూటర్‌ యాత్ర నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నవంబర్‌ 15న చలో విజయవాడ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓనల్లప్ప, బాలరంగయ్య, నాగేంద్ర కుమార్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌ రెడ్డి, వెంకనారాయణ, భాస్కర్‌, నాయకులు వి.శివారెడ్డి, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పరమేష్‌తో పాటు ఆయా మండలాల సిపిఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.