- రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: ఒకప్పుడు ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల్లో వ్యతిరేక భావన ఉండేదని, అందుకు భిన్నంగా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరిగిందని రెవెన్యూ మంత్రి ధర్మా ప్రసాదరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గత నెల 23వ తేదీన జగనన్న సురక్ష కార్యక్రమం ప్రారంభమైందని, జిల్లాలోని 732 సచివాలయాల్లో 84 శాతం ఇళ్లను, ఈ వ్యవస్థలో పనిచేస్తున్న వాలంటీర్లు తలుపు తట్టి వారి సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు. తక్కువ సమయంలో అర్హులకు ధ్రువీకరణ పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. గతంలో ప్రజలకు ఏ పని కావాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేదని, నేడు జగన్ ప్రభుత్వం ప్రజల వద్దకు అధికారులను పంపించి సంక్షేమ పథకాలను అందిస్తోందని తెలిపారు. గతంలో ఏ పని కావాలన్నా ప్రభుత్వ కార్యాలయాలు, జన్మభూమి కమిటీల చుట్టూ తిరిగి లంచాలు ఇచ్చుకునే పరిస్థితి ఉండేదని, అయినా పథకాలు అందుకోలేని స్థితి ఉండేదని పేర్కొన్నారు. నేడు లంచం అన్నదే లేకుండా పోయిందని తెలిపారు. అర్హత ఉండి పొరపాటున ఎక్కడైనా మిగిలిపోయిన అర్హులను తలుపుతట్టి మరీ మంచి చేసే కార్యక్రమమే సురక్ష అని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో 3.33 లక్షల ధ్రువపత్రాలను అందజేయగా, శ్రీకాకుళం నియోజకవర్గంలో 45,007 ధ్రువపత్రాలు అందజేశామని పేర్కొన్నారు.










