Nov 29,2022 21:59

ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలో ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ
ప్రజాశక్తి - ఏలూరు

        ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ నాశనమైందని ఎంఎల్‌సి షేక్‌సాబ్జీ అన్నారు. ఏలూరులో రెండు రోజులపాటు జరిగే ఎస్‌ఎఫ్‌ఐ 44వ జిల్లా మహాసభ స్థానిక సిఐటియు జిల్లా కార్యాలయంలో మంగళవారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన సాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు విద్యావ్యవస్థను మార్చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక సర్వనాశనం చేశారని విమర్శించారు. దేశంలో ఎక్కడా అమలు కాని నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, దీనివల్ల ప్రభుత్వ విద్యావ్యవస్థ దిగజారుగుతుందన్నారు. ఇప్పటికే టీచర్ల బయోమెట్రిక్‌ పేరుతో తరగతి గదులకు వెళ్లకుండా బయోమెట్రిక్‌ వేయాలని గంటలు తరబడి నిలిపివేస్తున్నారన్నారు. కొత్తగా ఫేస్‌ బయోమెట్రిక్‌ అమలు చేస్తామని చెబుతున్నారని దీనివల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. పేదవిద్యార్థులు చదువుకు దూరమవుతారన్నారు. భవిష్యత్‌లో విద్యార్థి ఉద్యమానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కె.ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాయన్నారు. విద్యార్థుల మధ్య మతాలు చిచ్చు పెడుతున్నారని విమర్శించారు. పాఠ్యాంశాల్లో రాజ్యాల గురించి, భారతదేశం గొప్పతనం గురించి చెప్పాల్సింది పోయి మతాల గురించి, పార్టీల గురించి ముద్రిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.