ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
ప్రభుత్వం నూతన విద్యా విధానం తీసుకువచ్చి ప్రాథమిక విద్యావ్యవస్థనే సర్వనాశనం చేసిందని ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు . ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పూర్తిగా ఉద్యోగ, ఉపాధ్యాయ వ్యతిరేక విధానాన్ని అమలుపరుస్తుందని విమర్శించారు. రివర్స్ పిఅర్‌సితో నిరాశపరిచిందన్నారు. డిఎలు ఇవ్వకుండా తాత్సారం చేస్తోందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా ఆలస్యం చేస్తోందన్నారు. డిఎస్‌సిలు లేకుండా కాలయాపన చేస్తుందన్నారు. భారీ స్థాయిలో ప్రమోషన్లు అని ఊరించి చివరకు పేపర్ ప్రమోషన్ అని చెబుతుందని హేళన చేశారు. గతకొద్ది నెలలుగా బదిలీలంటూ హడావుడి చేయడం తప్ప ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. దారుణంగా ఉద్యమ నేతలపై నిర్బంధకాండకు పూనుకుందని విమర్శించారు. ఈ గడ్డు సమయంలో అందరూ కలిసికట్టుగా ఉండి ఉద్యమ నాయకులకు సహకరించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గడ జగ్గారావు, ఫస్ట్ అసిస్టెంట్ సుధాకర్ రెడ్డి, స్టాఫ్ సెక్రటరీ కట్టా శ్రీను, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










