యుటిఎఫ్ జాతాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్
ప్రజాశక్తి-పాడేరు:ప్రభుత్వ విధానాలతో ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతోందని యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్ విమర్శించారు. యుటిఎఫ్ స్వర్ణోత్సవ సంబరాల సందర్భంగా నిర్వహిస్తున్న జాత శనివారం రాత్రి పాడేరు చేరింది. ఈ సందర్భంగా పాడేరు పుర వీధుల్లో యుటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు బైక్ ర్యాలీ నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో యుటిఎఫ్ జిల్లా సీనియర్ నాయకులు దేముడు యుటిఎఫ్ జండాను ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సంబరాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ రాష్ట్రంలో యుటిఎఫ్ ఒక్కటే పోరాడుతోందని తెలిపారు. రాష్ట్రంలో ఏడు వేల మంది సభ్యులతో ఆవిర్భవించిన యుటిఎఫ్ నేడు లక్ష నలభై వేల మంది సభ్యులతో బలమైన ఉపాధ్యాయ సంఘం గా ఆవిష్కతమైందన్నారు. స్వర్ణోత్సవ సంబరాలను పురస్కరించుకొని అక్టోబర్ 1న విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగే సభలో విద్యా రంగ సమస్యలపై ఉపాధ్యాయుల గళం వినిపించేందుకు యుటిఎఫ్ సిద్ధమైనట్లు తెలిపారు. సిపిఎస్ రద్దు కోసం యుటిఎఫ్ నిరంతర పోరాటం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ్, జిల్లా కార్యదర్శి వీ మహేష్, జిల్లా నాయకులు నాగేశ్వరరావు, చిట్టిబాబు, ధర్మారావు, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.










