ప్రజాశక్తి-గుంటూరు, నరసరావుపేట : దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అతిపెద్ద రంగమైన చేనేత రంగాన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టి, చేనేత కార్మికుల ఆత్మహత్యలు చేసుకునేలా ప్రభుత్వాల విధానాలున్నాయని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ, ఉపాధ్యక్షులు కట్టా శివదుర్గారావు అన్నారు. చేనేత కార్మికుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం గుంటూరు, నరసరావుపేటలోని కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేశారు. అనంతరం స్పందనలో కలెక్టర్లకు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా నరసరావుపేట ధర్నాలో చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కట్టా శివదుర్గారావు మాట్లాడుతూ చేనేత వస్త్రాల ఉత్పత్తికి కావాల్సిన నూలు, జరీ, పట్టు, రంగులు రసాయనాలు, చేనేత వస్త్రాలపై జిఎస్టి పూర్తిగా రద్దు చేయాలని, రాయితీపై పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలన్నారు. చేనేతలకు కేటాయించిన 11 రకాల వస్త్రాల ఉత్పత్తి రిజర్వేషన్ చట్టాన్ని కఠినంగా అమలు చేస్తూ వస్త్ర ఉత్పత్తి రిజర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 2023-24 వార్షిక బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో రూ.200 కోట్లను రూ.2 వేల కోట్లకు కేంద్ర బడ్జెట్ లో కేటాయించిన రూ.200 కోట్లను రూ.5వేల కోట్లకు రాబోయే బడ్జెట్లో పెంచాలన్నారు. చేనేత వస్త్రాల అమ్మకాలపై రీబేటూ పథకాన్ని ఆప్కో సంస్థతో పాటు ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు కూడా వర్తింపజేయాలని రీబేటు పథకం శాశ్వతంగా అమలయ్యేలా చట్టం చేయాలని కోరారు. చేనేత కార్మికుల వద్ద నిలువ ఉన్న చేనేత వస్త్రాలను ఆప్కో సంస్థ ద్వారా తక్షణమే కొనుగోలు చేసి చెల్లింపులు చేయాలని విద్యాశాఖ, సాంఘిక, షెడ్యూల్, తెగల సంక్షేమ శాఖలలో విద్యార్థులు కొరకు ఉపయోగించే వస్త్రాలు ఆప్కో సంస్థ ద్వారా చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలన్నారు. చేనేత కార్మిక సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి అనుముల వీర బ్రహ్మం మాట్లాడుతూ రాష్ట్రంలో 3 లక్షల మంది చేనేతలు ఉండగా నేతన్న నేస్తాన్ని 80 వేలకు మాత్రమే వర్తింప చేస్తున్నారని చేనేత బడ్జెట్ను మూడు లక్షల మంది చేనేతలకు నేతల నేస్తాన్ని వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. ఆప్కో వస్త్ర ప్రోక్యుర్మెంట్ లోని పవర్ లూమ్ వస్త్రాలను దొడ్డిదారిన కొనుగోలు చేయకుండా కఠినంగా చేనేత వస్త్రాలు కొనుగోలు మాత్రమే చేసేలా చర్యలు తీసుకోవాలని చేనేత రంగాన్ని చేనేతను కాపాడాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పద్మశాలి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కస్తూరి వెంకటేశ్వర్లు, కార్యదర్శి అనుముల నాగప్రసాద్, చేనేత కార్మిక సంఘం నాయకులు అవ్వారు అన్నపుశెట్టి, చేనేత కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు బి.ానకాలరావు, ప్రభాకర్‌రావు, సుసులోవ్ పాల్గొన్నారు.










