ప్రజాశక్తి - రాజమహేంద్రవరం ప్రతినిధి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే నిరుద్యోగం పెరిగిపోయిందని సిపిఎం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. సిపిఎం ఆధ్వర్యంలో హోటల్ రివర్‌బేలో బుధవారం నిరుద్యోగ రాష్ట్ర సదస్సు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగింది. సిపిఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్ సభికులను వేదికపైకి ఆహ్వానించారు. ఈ సదస్సుకు వి.శ్రీనివాసరావు ముఖ్యవక్తగా హాజరై మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటు, యువతలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీలతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను పూర్తిగా బుట్టదాఖలు చేశాయన్నారు. పరిశ్రమల ఏర్పాటు సెజ్‌లు అంటూ రైతుల నుంచి సేకరించిన భూములను తాకట్టు పెట్టుకుని కార్పొరేట్ సంస్థల యజమానులు బ్యాంకుల ద్వారా లబ్ధి పొంది ప్రజల సొమ్మును లూఠీ చేస్తున్నారని విమర్శించారు. అటువంటి అవినీతిపరులకు కేంద్ర ప్రభుత్వం ఆశ్రయమిస్తోందన్నారు. దేశంలోనే అత్యధిక నిరుద్యోగం రాష్ట్రంలో ఉందన్నారు. ఈ పరిస్థితులలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందంటూ ప్రచారం చేసుకోవడం సిగ్గు ఊచేటన్నారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల పెంపుతో చిరుపరిశ్రమలు మూతపడుతున్నాయని, ఫలితంగా ఉన్న కొద్ది పాటి ఉపాధికి యువత దూరమవుతుందన్నారు. ఆర్థిక సంక్షోభంతో భారీ పరిశ్రమలు సైతం ఇటీవల ఉద్యోగులను తొలగిస్తున్నాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో పట్టభద్రులు దిక్కుతోచని స్థితిలో మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్చడుతున్నారని తెలిపారు. ఉపాధి కల్పనలో కేరళలోని వామపక్ష ప్రభుత్వం దేశానికే ఆదర్శమని వివరించారు. చదువుకు తగిన ఉద్యోగం లభిస్తుందన్నారు. ఎంఎల్‌సి కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ కేంద్రం ఇప్పటికైనా రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం గ్రంథాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాలన్నారు. నియోజక వర్గానికి ఒక స్కిల్ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు. పిడిఎఫ్ ఎంఎల్‌సి ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్న బిజెపి ప్రభుత్వానికి వైసిపి ప్రభుత్వం వంత పాడుతుందన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించకుండా రాజకీయ అస్త్రంగా మార్చుతున్న పాలక ప్రభుత్వాలపై తిరగబడాలని పిలుపునిచ్చారు. యువజన పోరాటాలకు పిడిఎఫ్ ఎంఎల్‌సిల సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు హరికిషోర్, డివైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్, అధ్యక్షులు ప్రసన్న, శ్రామిక మహిళా సంఘం నాయకులు డి.రమాదేవి, ఎం.నాగమణి, ఐద్వా జిల్లా కార్యదర్శి పి.తులసి, సిపిఎం నగర కార్యదర్శి బి.పవన్, డాక్టర్ చైతన్యశేఖర్, సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు బి.రాజులోవ, పి.తులసి, జువ్వల రాంబాబు, ఎం.సుందరబాబు, ఎన్.రాజా, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి నిరుద్యోగులు పాల్గొన్నారు.










