
హిందూపురం : ప్రభుత్వ విద్య పరిరక్షణతో పాటు ఓపీఎస్‌ను సాధించుకోవడమే లక్ష్యంగా యుటిఎఫ్ ఆధ్వర్యంలో ముందుకు సాగుతామని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. యుటిఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నుంచి విజయవాడ వరకు బైక్‌ర్యాలీ గురువారం ప్రారంభం అయ్యింది. ఎన్జీవో హోం వద్ద యుటిఎఫ్ జెండా, స్వర్ణోత్సవ బోర్డును ఆవిష్కరించారు. శాంతికి ప్రతి రూపాలైన పావురాలను ఎగర వేసి గోపత్రికలు, కరపత్రాలను విడుదల చేశారు. హిందూపురంలో ప్రారంభం అయిన యాత్రను వెంకటేశ్వర్లు జెండాఊపి ప్రారంభించారు. ఈ యాత్ర హిందూపురం నుంచి పెనుకొండ, రాప్తాడు, అనంతపురం, ఉరవకొండ, గుంతకల్లు మీదుగా గురువారం రాత్రికి కర్నూలు జిల్లాలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యారంగం, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో రెండు ప్రచారయాత్రలు ప్రారంభం అయ్యాయని చెప్పారు. ఒకటి హిందూపురంలో ప్రారంభం అవగా, మరొకటి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ప్రారంభం అయ్యిందన్నారు. రెండు జాతాలు విజయవాడకు చేరుకుంటాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాలను కలుపుతూ జాతాలు కొనసాగుతాయన్నారు. 'ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుకుందాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుధ్ధరించుకుందాం' అన్న నినాదంతో జాతా కొనసాగుతోందని చెప్పారు. అక్టోబర్ 1న విజయవాడలోని సిద్ధార్థ ఆడిటోరియంలో యుటిఎఫ్ స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా నేటి విద్యారంగ పరిస్థితిపై మేధావులతో చర్చ జరుగుతుందని చెప్పారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడటాన్ని యుటిఎఫ్ ప్రధాన బాధ్యతగా తీసుకుందని చెప్పారు. 1974వ సంవత్సరంలో యుటిఎఫ్ ఆవిర్భావం నుంచి విద్యారంగ సమస్యల పరిష్కారంపై అనేక పోరాటాలు నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యా విధానాలు ప్రభుత్వ విద్యకు తీవ్ర నష్టదాయకంగా ఉన్నాయన్నారు. ఎన్నికలకు ముందు జగన్‌మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వారంలో పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని గొప్పలు చెప్పారన్నారు. అధికారంలో వచ్చిన నాలుగేళ్ల అనంతరం జిపిఎస్ పేరుతో ఉద్యోగులకు నష్టం చేకూర్చే మరో పెన్షన్ విధానం తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై ఉద్యమిస్తే ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడుతోందన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళనలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవడం విచారకరం అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం హక్కులను హరించే పాలన మానుకోవాలని హితవు పలికారు. జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయలు 2024 ఎన్నికల్లో ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. సమస్యల పరిష్కారంపై సాగించే పోరాటంలో భవిష్యత్తులో కలిసొచ్చే సంఘాలను కలుపుకుని విద్యారంగ సమస్యలపై ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్, సత్యసాయి జిల్లా అధ్యక్షులు జయచంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి సుధాకర్, ఎన్‌ఎస్‌పిఆర్ మహిళా డిగీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రగతి, గౌరవాధ్యక్షులు భూతన్న, సహాధ్యక్షులు బాబు, సీతాలక్ష్మి, కోశాధికారి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శి తాహెర్ వలీ, రాష్ట్ర కౌన్సిలర్ మారుతి, నాయకులు రామకష్ణ, మహంతి, చెన్న, మురళి, శ్రీనివాసులు, ముస్తఫా, సుల్తాన్, చంద్ర, రవి, విజరుతో పాటు పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.