Jun 28,2023 23:32
అమ్మఒడి నిధుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ మోపిదేవి

ప్రజాశక్తి-రేపల్లె: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల తలరాతలు మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విద్యలో పలు సంస్కరణలు ప్రవేశపెట్టిందని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. పట్టణంలోని సీతారామ కల్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అమ్మఒడి నిధుల పంపిణీ కార్యక్రమాన్ని వర్చువల్‌ విధానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి మాట్లాడుతూ విద్యకు పేద రికం అడ్డుకాకూడదని భావించిన సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. పేద విద్యార్థుల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని, విద్యార్థులకు పలు సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పా రు. చదువుకునే విద్యార్థులు చిరిగిన బట్టలు, అరిగిన చెప్పు లు, తెగిన బ్యాగులతో ఉండకూడదనే సంకల్పంతో జగనన్న విద్యా కానుక కిట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తమ పిల్లలు తమ కంటే గొప్పగా ఎదగాలనే తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా చదువుకునే ప్రతి విద్యార్థికి సంవత్స రానికి రూ.15 వేలు అమ్మఒడి పథకం ద్వారా నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు చెప్పారు. నాలుగు సంవత్సరాల పాలనలో అనేక మార్పులను తీసుకువచ్చినట్లు చెప్పారు. జిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్‌ బోధనా తరగతులు ప్రవేశపెట్టిన ఘనత సీఎం జగన్మోహన్‌రెడ్డిదే అన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి పిజె రామారావు, బుడా చైర్మన్‌ దేవినేని మల్లిఖార్జునరావు, ఆర్డీవో జగన్నాథం పార్థసారథి, మున్సిపల్‌ కమిషనర్‌ విజరు సారధి, చైర్మన్‌ కట్టా మంగ, మండల విద్యాశాఖ అధికారులు నవీన్‌ కుమార్‌, శ్రీహరి, సురేష్‌, శ్రీధర్‌, వైసీపీ పట్టణ అధ్యక్షుడు గడ్డ రాధాకష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.