Sep 26,2023 23:10

ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల ర్యాలీ

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
ప్రభుత్వ విద్యా రంగంలో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. తొలుత స్థానిక సుందరయ్య భవన్‌ నుంచి కలెక్టరేట్‌ వద్ద గల ధర్నా చౌక్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నా చౌక్‌ వద్ద జరిగిన ఆందోళనను ఉద్దేశించి ఎస్‌ఎఫ్‌ఐ కాకినాడ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.వరహాలు, ఎం.గంగాసూరిబాబు మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారంలోకి రాకముందు ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రపంచ స్థాయి తీసుకువెళ్తామని గొప్పలు చెప్పిందన్నారు. నేడు అధికారంలోకొచ్చాక పేద, మధ్య తరగతి విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నాయన్నారు. నూతన జాతీయ విద్యా విధానం ఎక్కడా లేని విధంగా జగన్‌ సర్కారు రాష్ట్రంలో అమలు చేస్తుందన్నారు. అందులో భాగంగానే మూడు, నాలుగు, ఐదు తరగతుల విలీనం జరిగిందన్నారు. ఫలింగా పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్య దూరమైందన్నారు. తక్షణమే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించాలన్నారు. హానర్స్‌ డిగ్రీ వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతారన్నారు. మేజర్‌, మైనర్‌ సబ్జెక్టు విధానం వల్ల విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారన్నారు. దీని వల్ల విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా నేటికీ డిగ్రీలో అడ్మిషన్‌ ప్రక్రియ పూర్తికాలేదన్నారు. ఆన్‌ లైన్‌లో అడ్మిషన్‌ ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. జిఒ 77ను రద్దు చేయాలన్నారు. పీజీ చదివే విద్యార్థులందరికీ విద్యా దీవెన, వసతి దీవెన అందించాలని డిమాండ్‌ చేశారు. కాకినాడ జిల్లాలో సంక్షేమ హాస్టల్లో పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. సంక్షేమ హాస్టల్స్‌ విద్యార్థులు సరైన వసతులు లేవన్నారు. సంక్షేమ విద్యార్థులకు నూతన భవనాలు నిర్మించాలని, హాస్టల్లో చదివే విద్యార్థులకు మెస్‌, కాస్మోటిక్‌ ఛార్జీలను పెంచాలని డిమాండ్‌ చేశారు. ప్లస్‌-1, ప్లస్‌-2గా అప్‌డేట్‌ అయిన ప్రభుత్వ మహిళా జూనియర్‌ కళాశాలలకు నూతన భవనాలు నిర్మించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌ యాత్రలో వచ్చిన సమస్యలపై జిల్లా వ్యాప్తంగా 42 సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టరేట్‌కార్యాలయం నుంచి వచ్చిన జిల్లా అధికారులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు మణికంఠ, వాసు, శ్రీకాంత్‌, కృప, సాహిత్‌, సంజరు, సిద్ధూ, లోవరాజు, శైలు, గోపాల్‌, ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు అభిషేక్‌, పవన్‌, ఆదర్శ, రాజు, అనూష, చిన్ని, లావణ్య, లలిత తదితరులు పాల్గొన్నారు.