Sep 14,2023 23:12

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షించుకోవడానికి విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాడాలని ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లావ్యాప్తంగా నిర్వహించిన విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్ర ముగింపు సభ కాకినాడ మెక్లారిన్‌ స్కూల్‌ ఆవరణలో గురువారం నిర్వహించారు. 7 రోజులపాటు 200 కిలోమీటర్లు ఈ యాత్ర సాగింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు పి.వరహాలు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎంఎల్‌సి ఐవి మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను తిరోగమన దిశలో నడిపిస్తోందన్నారు. విద్యారంగం ప్రయివేటీకరణకు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూనుకుంటోందని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లు, కళాశాలల్లోని సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్‌ చేశారు. పట్టణంలో పలు ప్రాంతంలోని విద్యాసంస్థలను సందర్శించారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఫ్యాన్లు లేవని, ఇంతవరకు పాఠ్యపుస్తకాలు అందలేదని తెలిపారు. జిఒ 77ను ప్రవేశపెట్టి పీజీ విద్యార్థులకు విద్యాదీవెన లేకుండా చేశారని, దీంతో పేదలు ఉన్నత చదువులకు వెళ్లకుండా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేశారన్నారు. జిఒలు 107, 108 ద్వారా వైద్య విద్యను ప్రయివేటుపరం చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, నాడు-నేడు ద్వారా మరమ్మతులకు నిధులు కేటాయించాలని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా మెస్‌ ఛార్జీలు రూ.3 వేలకు పెంచాలని, సన్న బియ్యం సరఫరా చేయాలని, పీజీ విద్యార్థులకు విద్యా దీవెన అందించాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ఖాళీ పోస్టులను భర్తీ చెయ్యాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు శ్రీకాంత్‌, వాసు, కృప, సాహిత్‌, లోవరాజు, సిద్ధు, చిన్ని, వెంకటేష్‌, అరుణ్‌, గోపాల్‌, సంజరు, ఆద్యర్శ, పవన్‌, నాని, పావని, విశాలాక్షి, హేమ, అభిషేక్‌, తేజ పాల్గొన్నారు.