ప్రజాశక్తి-కాకినాడ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన చేపట్టిన సైకిల్ యాత్ర బృందం కాకినాడ నగరంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, హాస్టల్ సందర్శించింది. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వరహాలు, ఎం.గంగా సూరిబాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను తిరోగమన దిశలో నడిపిస్తునాయన్నారు. విద్యారంగం ప్రయివేటీకరణకు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూనుకుంటోందని విమర్శించారు. ప్రభుత్వ బాలురు, బాలికల వసతి గహాల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. సంక్షేమ హాస్టళ్లు, కళాశాలల్లోని సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. పట్టణంలో పలు ప్రాంతంలోని విద్యాసంస్థలను వారు సందర్శించారు. వివిధ కళాశాల విద్యార్థులతో మాట్లాడి సమస్యలనడిగి తెలుసుకున్నారు. విద్యా రంగంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో విద్యార్థులకు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ఇంటర్ విద్యార్థులుకు పాఠ్యపుస్తకాలు అందలేదని తెలిపారు. జిఒ 77ను ప్రవేశపెట్టి పీజీ విద్యార్థులకు విద్యాదీవెన లేకుండా చేశారని, దీంతో పేదలు ఉన్నత చదువులకు వెళ్లకుండా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని పేర్కొన్నారు. జిఒలు 107, 108 ద్వారా వైద్య విద్యను ప్రయివేటు పరం చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, నేడు - నేడు ద్వారా మరమ్మతులకు నిధులు కేటాయించాలని పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు రూ.3 వేలకు పెంచాలని, సన్న బియ్యం సరఫరా చేయాలని, పీజీ విద్యార్థులకు విద్యా దీవెన అందించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్లతో సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ సైకిల్ యాత్ర ద్వారా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను, సంక్షేమ హాస్టళ్లను, పాఠశాలలను సందర్శించి సమస్యలను గుర్తించి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ యాత్రలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు, నగర నాయకులు, సిహెచ్.లోవరజు, కె.రాజేష్, నాని, పవన్, గోపాల్, జి.చిన్ని, శైలు, పావని, గిరీష, అభిషేక్, భాస్కర, సురేష్, రమేష్, వంశీ పాల్గొన్నారు.










