Nov 20,2023 00:25

యుటిఎఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో మాట్లాడుతున్న ఎంవిఎస్‌.శర్మ

ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్‌ : ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణమే యుటిఎఫ్‌ ధ్యేయమని ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌ శర్మ అన్నారు. హస్మిభవన్‌లోని యుటిఎఫ్‌ కార్యాలయంలో ఆదివారం యూనియన్‌ 49వ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ప్రధాన వక్తగా ఎంవిఎస్‌.శర్మ హాజరై ప్రసంగించారు. జిఒ 117 కారణంగా ప్రాథమిక పాఠశాలల మనుగడ ప్రశ్నార్ధంగా మారిందన్నారు. విద్య, వైద్య రంగాల నుంచి ప్రభుత్వం తప్పుకోవాలని చూస్తుందన్నారు. క్రమంగా వీటి ప్రయివేటీకరణ దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ రంగ ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. అదే సందర్భంలో ప్రజల సహకారంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న విధానాలను, నూతన జాతీయ విద్యా విధానాన్ని తిప్పి కొట్టాలన్నారు. సిపిఎస్‌ రద్దు హామీ మద్దతుతో గద్దెనెక్కిన వైసిపి ప్రభుత్వం జిపిఎస్‌ విధానాన్ని తీసుకురావడం ఉపాధ్యాయుల గొంతు కోయటమేనని పేర్కొన్నారు. 2024 ఎన్నికలలో ప్రతి రాజకీయ పార్టీ పాత పెన్షన్‌ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చే విధంగా పోరాటం చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులందరూ ఐక్యంగా పోరాడి ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌ నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో చిల్డ్రన్స్‌ క్లబ్‌ నిర్వాహకులు డాక్టర్‌ కోరెడ్ల రమాప్రభ మాట్లాడారు. అనంతరం యుటిఎఫ్‌ జిల్లా కమిటీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారిగా యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి మోహనరావు వ్యవహరించారు.
కమిటీ ఎన్నిక
గౌరవాధ్యక్షునిగా అనకాపల్లి పైడిరాజు, జిల్లా అధ్యక్షునిగా దాసరి నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా టిఆర్‌.అంబేద్కర్‌, అసోసియేట్‌ అధ్యక్షులుగా ఎన్‌.ప్రభాకరరావు, రొంగలి ఉమాదేవి, కోశాధికారిగా కె.రాంబాబు, జిల్లా కార్యవర్గ సభ్యులుగా ఉప్పాడ రాము, చుక్కా సత్యం, రియాజ్‌, తాటికొండ జగన్‌, రిజ్వాన్‌, వంగా రామలక్ష్మి, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌గా ఎం.రవిబాబు, రాష్ట్ర కౌన్సిలర్‌గా ఎస్‌ఎస్‌.నాగమణి, జిల్లా మహిళా కమిటీ కన్వీనర్‌గా జి.ఉషారాణి, కో-కన్వీనర్‌గా ఆవుగడ్డ సత్యకళ ఎన్నికయ్యారు.