Sep 23,2023 21:09

.రాయచోటి : పట్టణంలో నిర్వహిస్తున్న యుటిఎఫ్‌ బైక్‌ జాతా

రాయచోటి : ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకుందామని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వేంకటేశ్వర్లు అన్నారు. యుటిఎఫ్‌ 50వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నుంచి విజయవాడ వరకు నిర్వహిస్తున్న ప్రచారయాత్ర శనివారం రాయచోటికి చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక జూనియర్‌ కళాశాల వద్ద యుటిఎఫ్‌ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యా రంగాన్ని కాపాడుకుందాం పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించుకుందాం అన్న నిదానంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు టీంల ఆధ్వర్యంలో జాత కొనసాగుతుందన్నారు. అక్టోబరు ఒకటో తేదీన విజయ వాడలో సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కాలేజ్‌లో జరుగు స్వర్ణోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఉపాధ్యాయులకు ఇచ్చిన మాట తప్పారన్నారు. జిపిఎస్‌ రద్దుచేసి ఒపిఎస్‌ అమలు చేస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒపిఎస్‌ సాధనకు ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అధ్యయన, అధ్యా పనం, సామాజిక స్పహ ప్రధాన సూత్రాలతో యుటిఎఫ్‌ ఆవిర్భవించి ఆ దిశలో ప్రయాణిస్తూ ఉపాధ్యాయుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసి త్రిబంల్‌ బెనిఫిట్స్‌ స్కీం, రీ గ్రూపింగ్‌ స్కేల్‌, ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌ విధానం, అప్రెంటిస్‌ విధానం రద్దు వంటి వాటిని సాధించామని చెప్పారు. ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే 2024 ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సురేష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉపాధ్యాయులు, ఉద్యోగులు విరమణ అనంతరం వారి భవిష్యత్తు కోసం పాత పెన్షన్‌ పథకం తప్పా ఏది ప్రత్యామ్నాయం కాదని ఒపిఎస్‌ సాధన కోసం కలిసి వచ్చే అన్ని సంఘాలతో రాజీ లేని పోరాటాలు చేస్తామని అయన అన్నారు. ప్రభుత్వ విద్యా రంగాన్ని బలహీన పరిచే జాతీయ నూతన విద్యా విధానాన్ని పునఃపరిశీలన చేసి మేధావులు, విద్యా వేత్తలతో చర్చించి కామన్‌ స్కూల్‌ విధానాన్ని తీసుకుని రావాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయులను చదువు చెప్ప నీయకుండ రకరకాలైన పనులను పురమాయిస్తోందని అన్నారు. రాష్ట్ర సిలబస్‌ అని, సెంట్రల్‌ సిలబస్‌ అని ఇప్పు డేమో ఐబి సిలబస్‌ అనే చర్చకు తెర లేపారని అయన విమ ర్శించారు. స్టేట్‌ సిలబస్‌ చదివిన విద్యార్థులు అన్ని పోటీ పరీక్షల్లో ధీటుగా రాణిస్తున్నారని, అటువంటప్పుడు కొత్త కొత్త ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఒపిఎస్‌ సాధించేంతవరకు కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్‌, జాబిర్‌, జిల్లా కార్యదర్శులు గంగాదేవి, రమణయ్య, శ్రీధర్‌రెడ్డి, జిల్లా ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ సురేంద్రరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు చెంగల్వరాజు, సీనియర్‌ నాయకులు మత్యుంజయ రాజు వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పీలేరు: యుటిఎఫ్‌ స్వర్ణోత్సవ బైక్‌ జాతా పీలేరుకు చేరుకుంది. ప్రచార జాతకు పీలేరు డివిజన్‌ తరఫున పట్టణ శివారులోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముందు స్వాగతం పలికారు. అక్కడి నుంచి పీలేరు క్రాస్‌ రోడ్డుకు 100 స్కూటర్లతో ర్యాలీ నిర్వహించి, క్రాస్‌ రోడ్‌లో యుటిఎఫ్‌ జెండాను పీలేరు డివిజన్‌ సీనియర్‌ నాయకులు రాధాకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ప్రసంగించారు. కార్యక్రమంలో యుటిఎఫ్‌ సహాధ్యక్షులు శివారెడ్డి, కోశాధికారి, రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యులు సదాశివరెడ్డి, కెవి.పల్లి నాయకులు వెంకటరమణ, రమేష్‌రెడ్డి, జంగారెడ్డి, మోహన్‌రెడ్డి పాల్గొన్నారు