Jul 14,2023 21:14

మాట్లాడుతున్న యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ఏ రాష్ట్ర భవిష్యత్తు అయినా ఆ రాష్ట్ర విద్యా వ్యవస్థపై ఆధారపడి ఉంటుందని, విద్యావ్యవస్థ బలోపేతంగా ఉంటే కుటుంబం, ప్రాంతం, రాష్ట్రం, దేశమే అభివృద్ధి చెందుతుందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు అన్నారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలోని యుటిఎఫ్‌ జిల్లా కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయ సారధి అధ్యక్షత వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమై నెల దాటినా జెవికె కిట్లను పూర్తి స్థాయిలో అందించలేదని, పాఠశాలకు కిట్లు రాకపోయినా వచ్చినట్లు బయోమెట్రిక్‌ వేయాలని ఉపాధ్యాయులను ఒత్తిడి చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గడం పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5400 ఎలిమెంటరీ పాఠశాలలను ప్రాథమిక పాఠశాలలో విలీనం చేయడంతో 1, 2 తరగతుల్లో అసలు చేరని పరిస్థితి కూడా కొన్ని పాఠశాలల్లో ఉందన్నారు. 1 నుండి 5వ తరగతి వరకు ఉన్న పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటంతో పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందదని తల్లిదండ్రులు భావిస్తున్నారని, అందుకే పిల్లల్ని చేర్చడం లేదని చెప్పారు. ప్రాథమిక పాఠశాల విద్యను బలోపేతం చేయకుండా విద్యారంగ సంస్కరణ చేస్తున్నామని ప్రభుత్వం చెప్పడం అవివేకమని విమర్శించారు. ప్రాథమిక పాఠశాలలు లేకపోతే హైస్కూల్లో చేరికలపైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరిక కోసం యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులకు అవగాహన కల్పించే కార్యక్రమం చేపడతామన్నారు.
జీవో 117ను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి తన పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను అమలు చేయాలన్నారు. జిపిఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. పల్నాడు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు బాగున్నాయని, ఉపాధ్యాయుల కొరతలేదని తల్లిదండ్రులు భావిస్తున్న నేపథ్యంలో కొంతమంది ఉపాధ్యాయులను ప్రభుత్వ సిఫార్సు బదిలీల పేరుతో పంపించడంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సిఫార్సులను అక్రమ బదిలీలను నిలిపేయకుంటే డిఇఒ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. విజయ సారథి మాట్లాడుతూ బదిలీపై పల్నాడు జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయులకు వారు పనిచేసిన ప్రాంతంలో రిలీఫ్‌ చేయకపోవడంతో ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదన్నారు. ప్లస్‌ వన్‌ పోస్టులు ప్రవేశాలు ఇచ్చి పంపిన వారికి కూడా వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో యుటిఎఫ్‌ పట్టణ అధ్యక్షులు ఒ.కోటేశ్వరరావు, గౌరవాధ్యక్షులు టి.ఏడుకొండలు, ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జి.ఆంజనేయులు, కార్యదర్శులు ఎల్‌.పూర్ణచంద్రరావు, ఎస్‌.మురళి పాల్గొన్నారు.