Jun 01,2023 18:59

ఆదోనిలో దీక్ష చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగులు

ప్రజాశక్తి - ఆదోని
ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే గుణపాఠం తప్పదని ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు బండి శ్రీధర్‌ హెచ్చరించారు. గురువారం పట్టణంలోని ఎన్‌టిఆర్‌ సర్కిల్‌లో ఎపి జిఈఎ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోసం తాలూకా అధ్యక్షులు ఎస్‌ఎ.రషీద్‌ ఆధ్వర్యంలో ఉద్యోగులు నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు ఆయా ప్రభుత్వ శాఖల్లో పని చేసే ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన బండి శ్రీధర్‌, ప్రధాన కార్యదర్శి సురేష్‌ రెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాజకీయ హామీగా పాదయాత్రలో ఇచ్చిన వాగ్దానాల్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ప్రతినెలా ఉద్యోగులు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. డిఎలు సకాలంలో చెల్లించకపోగా వాటిని పెండింగ్‌ పెడుతూ అరియర్స్‌ను విడుదల చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీ జీతం పొందడం హక్కు అని, దీనిపై చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. 11వ పిఆర్‌సిలో బకాయి పడ్డ డిఎలు, అరియర్స్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఉద్యోగులు దాచుకున్న సొమ్ముకు భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్నూలు సిటీ అధ్యక్షులు మురళీధర్‌ నాయుడు, ఆదోని తాలూకా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు నాగ రవి, ఎల్లయ్య, రాధాకృష్ణ, వేణు, నబి రసూల్‌, లక్ష్మి, ఇందిరా, దోరతి, వీరేష్‌, గోపాల్‌ పాల్గొన్నారు.