ప్రజాశక్తి-వేటపాలెం: రోగులకు అందించే మందులను కలగూరగంపలాగా ఉంచటాన్ని చూసి చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి సరిగా ఉంచుకోవాలని వైద్యసిబ్బందికి సూచించారు. మందులు అన్ని పంపిణీ చేయాల్సినవా లేక గడువు తీరిన మందులా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. క్రమపద్ధతిలో పెట్టుకోవాలి కదా అని ప్రశ్నించారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ ప్రాంగణంలో వైఎస్సార్ ఆసరా మూడో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం తిరుగు ప్రయాణంలో ఎమ్మెల్యే కరణం బలరాం వెళ్లేటప్పుడు ఆకస్మికంగా స్థానిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పటల్ ప్రాంగణాన్ని, గదులను కలియతిరిగారు. త్వరలో రూ.కోటి 75 లక్షలతో నిర్మించిన నూతన భవనాన్ని ప్రారంభించటానికి తేదీ ఖరారు చేస్తానన్నారు. ఈ సందర్భంగా వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఎఎన్‌ఎంలు గ్రూపులుగా ఎమ్మెల్యే బలరాంతో ఫోటోలు దిగి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపాలిటీ వైస్‌ఛైర్మన్ జైసన్‌బాబు, సర్పంచ్ రమణ, పిఎసిఎస్ ఛైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, డాక్టర్ మేడా ప్రభాకర్‌రావు, ఎంపీహెచ్‌ఈఓ చింతా శేషుబాబు పాల్గొన్నారు.










