
ప్రజాశక్తి వార్తకు స్పందన
ప్రజాశక్తి - అద్దంకి
ప్రభుత్వ వైద్యశాలలో కానుపైన గంటల వ్యవధిలోనే బాలింత మృతి చెందిన ఘటన పాఠకులకు విదితీమే. ప్రజా సంఘాల ఫిర్యాదు మేరకు స్పందించిన ఉన్నత స్థాయి అధికారులు బృందం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో సీనియర్ వైద్యురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో గురువారం విచారణ చేశారు. ఉదయం 10:30 గంటల సమయంలో వైద్యులు వాయిలా చౌదరి, నర్సులను పూర్తిస్థాయిలో విచారించి స్టేట్మెంట్ నమోదు చేశారు. అనంతరం ప్రజా సంఘాల నాయకులు, దళిత సంఘ నాయకులను పిలిపించి వారితో మాట్లాడారు. ప్రజా సంఘాల నేతలు తమ అభిప్రాయాలను చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వైద్యురాలిని వెంటనే సస్పెండ్ చేసిన తరువాత విచారణ చేపడితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దళిత నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విచారణ అధికారిణి డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ కాన్పు అయిన తరువాత మృతి చెందగా ఉన్నత స్థాయి అధికారులు విచారణ నిమిత్తం ముగ్గురు వైద్యులను నియమించారని అన్నారు. కాన్పు తర్వాతే గుండెనొప్పి రావడంతో వెంటనే అంబులెన్స్‌లో వైద్యశాలకు తరలించే లోపే మృతి చెందినట్లు ఆమె చెప్పారు. సాధారణ కాన్పు అయ్యే క్రమంలో నర్సులు కాన్పు చేయవచ్చని అందులో ఇబ్బంది లేదని విజయలక్ష్మి తెలిపారు.