May 26,2023 19:26

వేగంగా జరుగుతున్న గదుల నిర్మాణం

ప్రజాశక్తి - ఆదోని
రాష్ట్రంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే నాడు-నేడు కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారు. గతంలో గదులు చాలక విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం నాడు-నేడుతో అదనపు గదుల నిర్మాణం చేపడుతుండడంతో ఆ సమస్య తీరిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. పట్టణంలోని ఆర్‌ఆర్‌ లేబర్‌ కాలనీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలకు నూతన సొబగులు వచ్చాయని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు.
గతంలో ఇరుకు గదులతో ఇబ్బందులు
లేబర్‌ కాలనీలో ఉన్న మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులు విద్యనభ్యసించేవారు. సుమారు 600 మంది విద్యార్థులు వచ్చేవారని, ఆరు గదులతో ఇబ్బందులు ఉండేవారమని ఉపాధ్యాయులు తెలిపారు.
తీరిన గదుల కొరత
పట్టణంలోని లేబర్‌ కాలనీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల రూపురేఖలు మారాయి. నాడు-నేడు కింద రెండో విడతలో హైస్కూల్‌ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. సుమారు రూ.2.20 కోట్ల వ్యయంతో 20 గదుల నిర్మాణానికి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. విద్యార్థులకు కనీస అవసరాలు కల్పించేందుకు, మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం అందుబాటులోకి తెచ్చారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోపు గదులను అందుబాటులోకి తెస్తామని ప్రధానోపాధ్యాయులు రమేష్‌ నాయుడు తెలిపారు. ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 837 మందికి పెరిగిందని చెప్పారు. తరగతి గదిలో కుర్చీలు, బెంచీలు, బ్లాక్‌ బోర్డులు, ఫ్యాన్లు, విద్యుత్‌ సౌకర్యం ఉండడం వల్ల పేద, ధనిక తేడా లేకుండా విద్యార్థులు చేరుతున్నారని తెలిపారు. సౌకర్యాలు కల్పించడం వల్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పాఠశాల గతంలో డివిజన్‌ స్థాయిలో మోడల్‌ స్కూల్‌గా గుర్తింపు పొందింది. అదే తరహాలోనే విద్యను బోధిస్తున్నామని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
త్వరలోనే పనులు పూర్తి చేయిస్తాం
- రమేష్‌ నాయుడు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు

పాఠశాల పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన్‌ నకుల రాజు, సచివాలయ కమ్యూనిటీ సెక్రటరీ నాగరాజు, తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల దినదిన అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం నాడు-నేడు కింద 20 గదుల నిర్మాణం జరుగుతుండడం వల్ల గదుల సమస్య తీరింది. పాఠశాలలో చేరే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. మెరుగైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయుల కొరత ఉన్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. అందరి సహకారంతో మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తాం. విద్యాసంస్థల ప్రారంభంలోపు గదులను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నాం.