May 01,2023 22:00

రెండు లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా ధాన్యం కల్లాల్లోనే
వర్షాలకు తడిసి ముద్దయిన పంట
కన్నీరుమున్నీరవుతున్న రైతులు
లారీలు, సంచులు అందించకపోవడమే లోపం
లక్ష్యానికి మించి ధాన్యం కొనొద్దంటూ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు
మొక్కజొన్న రైతుల పరిస్థితీ అదే
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ తప్పిదాలకు అన్నదాత బలిపశువుగా మారాడు. సకాలంలో లారీలు, సంచులు అందించకపోవడంతో సోమవారం తెల్లవారుజామున ముంచెత్తిన వర్షానికి కళ్లాల్లోని పంటంతా తడిసి ముద్దయింది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం వ్యవహరించిన తీరే దీనికి కారణమంటూ రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. మాసూళ్లు చేసి వారం, పదిరోజులు గడుస్తున్నా లారీలు లేక పంటంతా కళ్లాల్లోనే ఉండిపోయింది. సరిపడా లారీలు సకాలంలో పంపాల్సిన అధికారులు అది వదిలేసి మాటలతో కాలక్షేపం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా పౌరసరఫరాల శాఖాధికారులు వ్యవహరించిన తీరు కారణంగానే పండిన పంట తడిసిపోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. బస్తాల్లో పట్టిన ధాన్యం సైతం వర్షానికి తడిచిపోయింది. సరిపడా లారీలు రావడం లేదంటూ రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా లారీలు పంపుతున్నామంటూ అధికారులు వట్టి కబుర్లు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. టార్గెట్‌లు పూర్తయిన చోట ఇంకా రైతుల వద్ద ధాన్యం ఉండిపోయింది. టార్గెట్‌ పెంచాలని కిందిస్థాయి అధికారులు పదేపదే చెబుతున్నా పట్టించుకోని పరిస్థితి ఉంది. సకాలంలో లారీలు, సంచులు ఏర్పాటు చేసి ఉంటే ఇప్పటికే 75 శాతానికిపైగా ధాన్యం కొనుగోలు జరిగి ఉండేది. ప్రభుత్వం వ్యవహరించిన తీరు కారణంగా ఇప్పటికే దాదాపు 50 శాతం పంట కళ్లాల్లోనే ఉండిపోయింది. ఇప్పటికే నానా ఇబ్బందులు పడి రైతులు ధాన్యం ఆరబెట్టారు. వర్షానికి తడవడంతో మళ్లీ ఆరబెట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. పొలాల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో ధాన్యం ఆరబెట్టుకునేందుకు వీల్లేని పరిస్థితి నెలకొంది. రైతుల కష్టాలకు ప్రభుత్వం, జిల్లా పౌరసరఫరాల శాఖాధికారుల తప్పిదాలే కారణమనే అభిప్రాయం రైతుల్లో పెద్దఎత్తున విన్పిస్తోంది.
టార్గెట్‌కు మించి ధాన్యం కొనొద్దంటూ హుకుం
రెండు జిల్లాల్లోనూ టార్గెట్‌కు మించి ధాన్యం కొనుగోలు చేయొద్దంటూ కిందిస్థాయి అధికారులకు కచ్ఛితమైన ఆదేశాలు అందాయి. పండిన పంటలో 60 శాతం మాత్రమే టార్గెట్‌గా నిర్ణయించారు. ఏలూరులో 79 వేల ఎకరాల్లో రైతులు వరి సాగు చేశారు. 3.90 లక్షల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రతి గింజా కొనుగోలు చేస్తామంటూ ఒకపక్క బీరాలు పలుకుతున్న ప్రభుత్వం మరోపక్క రెండు లక్షల టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని మండలస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. పలు రైతుభరోసా కేంద్రాల్లో ఇచ్చిన టార్గెట్‌ పూర్తవడంతో సంచులు ఇవ్వని పరిస్థితి నెలకొంది. కొవ్వలి, భీమడోలు, గుండుగొలను, పూళ్ల, నారాయణపురం వంటి పలుచోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పశ్చిమలో 9.28 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేయగా 6.47 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని టార్గెట్‌గా నిర్ణయించారు. ఇప్పటికే చాలా రైతుభరోసా కేంద్రాల్లో ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్‌ పూర్తవడంతో రైతులకు సంచులు లేవని చెబుతున్నారు. దీంతో రైతులకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ప్రతి గింజా కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం ఈ విధంగా వ్యవహరించడంపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిర్ధేశించిన టార్గెట్‌కు మించి ధాన్యం కొనుగోలు చేయడం కుదరదని, మిగిలిన ధాన్యం రైతులు బహిరంగ మార్కెట్లో అమ్ముకునేలా చేయాలంటూ కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు అందుతున్నాయి. బహిరంగ మార్కెట్లో 75 కిలోల బస్తాకు రూ.1450 మించి ఇవ్వడం లేదు. దీంతో రైతు బస్తాకు రూ.80 వరకూ నష్టపోతున్నాడు. రైతులకు మద్దతు ధర దక్కేలా చేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం దీన్ని ఏవిధంగా సమర్థించుకుంటుందో అర్థం కావడం లేదు. ప్రతి గింజనూ కొనుగోలు చేసేలా ప్రభుత్వం వెంటనే ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా ప్రభుత్వం చేసిన తప్పిదానికి వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంట సైతం తడిసి ముద్దయింది.