ప్రజాశక్తి-పంగులూరు: కోట్ల రూపాయలు విలువచేసే ప్రభుత్వ స్థలం అన్యాక్రాంత మవుతున్నా అటు రెవెన్యూ అధికారులు గాని, ఇటు ప్రభుత్వం గానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ స్థలాన్ని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు ఆక్రమించు కోవడం, ఆక్రమిం చుకున్న స్థలాన్ని అమ్ముకోవటం, అందులో నిర్మాణాలు చేసుకోవటం పరిపాటిగా మారిపోయింది. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ స్థలాన్ని, ప్రతినిత్యం ప్రభుత్వ అధికారులు, రెవెన్యూ అధికారులు, రాజకీయ నాయకులు తిరుగుతున్నా ఆక్రమణదారులు మాత్రం నిర్భయంగా ఆక్రమించుకుంటున్నారు. అడిగేవారు ఎవరూ లేరని, ఎవరి ఇష్టం వచ్చినట్లు వారే వ్యవహరిస్తున్నారు. మండలంలోని కొండమంజులూరు సమీపంలో, జాతీయ రహదారి ఆనుకొని, పడమర వైపున ఉన్న సర్వే నెంబర్ 58లోని, రెండు ఎకరాల 42 సెంట్లు డొంక పోరంబోకు భూమి ఉంది. దీన్ని గతంలో కోనంకి డొంక అని పిలిచేవారు. జాతీయ రహదారి విస్తరించడంతో ఈ ప్రాంతంలో ఉన్న భూములకు రెక్కలు వచ్చాయి. స్థలాలకు ధరలు విపరీతంగా పెరగడంతో, ఎక్కడ సెంటు స్థలం దొరికినా దాన్ని కబ్జా చేయటం ఇక్కడ పరిపాటి అయింది. ఇందులో భాగంగానే సర్వే నెంబర్ 58లో ఉన్న రెండు ఎకరాల 42 సెంట్ల భూమి కూడా ఆక్రమణకు గురైంది. కొంతమంది ఈ భూమిలో ఇప్పటికే హోటళ్లు, టీ స్టాళ్లు నిర్మించుకోగా, మరికొంతమంది తమ సొంత ఆస్తి లాగా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటున్నారు. కొంతమంది ఏకంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. సుమారు రూ.5 కోట్ల విలువచేసే ఈ భూమి, 20 సెంట్లు మినహాయించి మిగతా మొత్తం ఆక్రమణలకు గురైంది. ఈ విషయంపై గత రెండు నెలల క్రితం 'ఐదు కోట్ల భూమి ఆక్రమణ' పేరుతో 'ప్రజాశక్తి'లో వార్త వచ్చింది. ఆ సమయంలో కొంత హడావుడి చేసిన అధికారులు, మళ్లీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ ఆక్రమణల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ కాలంలో సుమారు పది సెంట్ల భూమిని, ఓ వ్యక్తి సొంత ఆస్తిలాగా అమ్ముకోగా, కొన్న వ్యక్తి అందులో ఇంటిని నిర్మించి, దాని చుట్టూ ఫెన్సింగ్ కూడా వేశాడు. మరోవ్యక్తి సుమారు 20 సెంట్ల భూమిలో కట్టడాన్ని నిర్మించేందుకు పని ప్రారంభించాడు. ఈ విధంగా ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్నా పట్టించుకున్న నాథుడే లేడు.
ఆక్రమణదారులందరికీ నోటీసులు ఇస్తాం: తహశీల్దారు పద్మావతి
జాతీయ రహదారి వెంబడి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకున్న ప్రతి ఒక్కరికి నోటీసులు అందజేసి, ఆక్రమణలు తొలగిస్తామని, పంగులూరు మండల తహశీల్దారు పద్మావతి అన్నారు. మంగళ వారం మధ్యాహ్నం రెవెన్యూ సిబ్బందితో కలిసి ఆమె ఆక్రమణ దారులు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ, స్థలాన్ని సొంత భూమి లాగా ఆక్రమించుకొని, అమ్మకాలు జరుపుకోవడం, అక్రమంగా ఇల్లు నిర్మించుకోవటం చట్టరీత్యా నేరమని, ఆక్రమణదారులు తక్షణమే స్థలాలను ఖాళీచేసి వెళ్లాలని, ఆమె ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో హోటళ్లు, టీ స్టాళ్లు, ఇళ్లు నిర్మించుకున్న వారికి వెంటనే నోటీసులు ఇవ్వాలని కొండమంజులూరు విఆర్‌ఒ వెంకటేశ్వర్లుకు ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు ఇచ్చినా ఖాళీ చేయని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తహశీల్దారు పద్మావతి అన్నారు. ఆమె వెంట కొండమంజులూరు వీఆర్వో వెంకటేశ్వర్లు, మండల సర్వేయర్ వినోద్, కొండమంజులూరు గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీనివాసరావు ఉన్నారు.










