Aug 02,2023 23:12

సమావేశంలో మాట్లాడుతున్న కింజరాపు అచ్చెన్నాయుడు

- అందరి బండారం బయటపెడతా
- ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాశక్తి - టెక్కలి: 
టెక్కలి పట్టణంలో ప్రభుత్వాలు అన్యాక్రాంతానికి గురవుతున్నాయని ఎమ్మెల్యే, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రెవెన్యూ అధికారుల అసమర్థత వల్లే దురాక్రమణకు గురవుతున్నాయని విమర్శించారు. స్థానిక టిడిపి కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్ణకారుల సంక్షేమ సంఘ స్థలం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి ఎలా మారిందని ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 22/ఎలో ఉన్న దాన్ని ఇప్పుడు ఎలా తొలగించారని ప్రశ్నించారు. జిల్లా కేంద్రాస్పత్రి పక్కన పంచాయతీ స్థలం ఆక్రమణకు గురైందన్నారు. సర్వే నంబరు 498/ఎలో ఉన్న 95 సెంట్ల స్థలంలో అటవీశాఖ కార్యాలయ భవనం, అతిథిగృహ నిర్మాణానికి కేటాయిస్తే, అది కూడా ప్రయివేట్‌ వ్యక్తుల చేతుల్లోకి మారిందని తెలిపారు. భవానీనగర్‌ వద్ద కొన్ని సంస్థలు, సంఘ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయిస్తే వాటినీ ఆక్రమించుకున్నారని విమర్శించారు. ఈ వ్యవహారంలో కోట్లాది రూపాయల నగదు చేతులు మారాయని ఆరోపించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా తాను పట్టణంలోని ప్రభుత్వ స్థలాలకు కాపలాదారునిగా ఉన్నానని చెప్పారు. అసమర్థ అధికారుల బండారం బయటపెడతానని హెచ్చరించారు. తన వద్ద అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయని, ఎవరినీ విడిచిపెట్టేది లేదన్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా తాను చేసిన అభివృద్ధి తప్ప ఈ నాలుగున్నరేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆక్రమిత స్థలాల్లో భవన నిర్మాణాలు చేపట్టినా, టిడిపి ప్రభుత్వం వచ్చాక వాటిని కూల్చివేస్తామని చెప్పారు. భావనపాడు పోర్టు విషయంలో టిడిపి ప్రభుత్వం రైతులను సంతృప్తిపరిచి భూములను సేకరించిందని, ఆ విధంగా ప్రస్తుత ప్రభుత్వం మూలపేట విషయంలో వ్యవహరించకపోవడంతో భూములను సేకరించలేకపోయిందని విమర్శించారు. అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, రైతులకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదన్నారు. పోలీస్‌ బందోబస్తు నడుమ అధికారులు మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించడం సిగ్గుచేటు అని అన్నారు. త్వరలో తాను మూలపేట పోర్టు నిర్వాసిత గ్రామాల్లో పర్యటిస్తానన్నారు. సమావేశంలో టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల పార్టీ ఆధ్యక్షులు బగాది శేషగిరి, పినకాన ఆజరుకుమార్‌, బోయిన గోవిందరాజులు, జీరు భీమారావు, మాజీ ఎంపిపి మట్ట సుందరమ్మ, హనుమంతు రామకృష్ణ, మెండ దమయంతి తదితరులు పాల్గొన్నారు.