ప్రజాశక్తి-సీతమ్మధార : ప్రభుత్వ స్థలాలు ఎక్కడా ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధికారులకు సూచించారు. అభివృద్ధి పనుల పర్యవేక్షణలో భాగంగా జివిఎంసి 24వ వార్డులో స్థానిక కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, కమిషనరు రాజాబాబు, వైసిపి సమన్వయకర్త కె.కె రాజుతో కలిసి బుధవారం పర్యటించారు. స్థానికుల సమస్యలనడిగి తెలుసుకున్నారు. స్థానికంగా ఉన్న గెడ్డలు, కల్వర్టులు ఆక్రమణకు గురికావడంతో ఎక్కడికక్కడ వ్యర్ధాలు నిలిచిపోతున్నాయని స్థానికులు వివరించారు. కొత్త రేసపువానిపాలెం, పాత రేసపువానిపాలెంనకు ఒకే శ్మశానం ఉండటంతో ఖనన సమయంలో రహదారి అధిగమించే క్రమంలో ప్రమాదాల బారిన పడుతున్నారని కమిషనర్ దృష్టికి కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సమస్యపై చర్చించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విశాఖ నగర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. వార్డుల్లో మౌలిక వసతులపై నేరుగా ప్రజల నుంచి వినతలు స్వీకరించి ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ విజయలక్ష్మి పాల్గొన్నారు.










