ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జరిగితే అందుకు వీఆర్వోలే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి హెచ్చరించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో విఆర్‌ఓలతో బుధవారం సమావేశం నిర్వహించారు. తహశీల్దారు గంగాధర్‌రావు సమక్షంలో ఆక్రమణలపై వీఆర్వోలను తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల్లో వీఆర్వో, గ్రామ కార్యదర్శి ధ్రువీకరణ పత్రాలతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు తమ దష్టికి వచ్చిందని తెలిపారు. స్పందన కార్యక్రమాల్లో అనకాపల్లి మండలం నుంచి ప్రధాన ఫిర్యాదులు భూకబ్జాలు, ఆక్రమణలపైనే వస్తున్నాయని, ఆక్రమణదారులు ఎంతటి పెద్దవారైనా, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఉపేక్షించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను తొలగించి హెచ్చరికల బోర్డులు పెట్టాలన్నారు. ఆక్రమణదారులు కోర్టుకు వెళ్లిన స్థలాలను మాత్రం ఆదేశాలు వచ్చేంతవరకు యథావిధిగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆక్రమణదారులపై సమగ్ర నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. ల్యాండ్ పూలింగ్ బి ఫారం పట్టాదారులు ఎల్పిఓల కోసం తహశీల్దారు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని, విశాఖ కలెక్టరేట్ నుంచే దీనిని పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. రైతులు సమస్యలను తమ గ్రామాల్లో ఉన్న సచివాలయాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. సమావేశంలో డిటి శ్రీరామ్మూర్తి, రమేష్, వీఆర్వోలు పాల్గొన్నారు.










