Sep 15,2023 22:08

ప్రభుత్వ స్థలంలో చేపడుతున్న నిర్మాణాలు

నెల్లిమర్ల: ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు జోరందుకున్నాయి. నగర పంచాయతీ పరిధిలో ప్రభుత్వ స్థలాలను అక్రమార్కులు దౌర్జన్యంగా కబ్జా చేసి నకిలీ పత్రాలను సృష్టించి నిర్మాణాలు జరుపుతున్నారు. స్థానిక డైట్‌ కాలనీ నెల్లిమర్ల - విజయనగరం ప్రధాన రహదారి పక్కన సర్వే నెంబర్‌ 65/3లో సుమారు 60 సెంట్ల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని అధికారులు గాయ్యాలుగా గుర్తించినప్పటికీ కొంత మంది అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారు. ఇదే స్థలాన్ని గతంలో ఒక వ్యక్తికి డి- పట్టా మంజూరు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. కాగా ఈ స్థలాన్ని తాను కొనుగోలు చేసానని చెబుతూ ఒక వ్యక్తి దౌర్జన్యంగా తన వద్ద ఎటువంటి ఆధారాలూ లేకపోయినప్పటికీ నిర్మాణం చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించి నాలుగు నెలలు క్రితం నిర్మాణ పనులను నిలుపుదల చేశారు. అయితే వారం రోజులు క్రితం మళ్లీ అదే భూమిని సదును చేసి అక్రమంగా అదే వ్యక్తి నిర్మాణం చేపడుతున్నారు. నెల్లిమర్ల- విజయనగరం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న విలువైన భూమి కావడంతో దీనిపై కన్నేసిన సదరు వ్యక్తి రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ నిర్మాణాలకు పూనుకున్నారు. పైగా నిర్మాణాలను నిలుపుదల చేయాలని ఆదేశించిన రెవెన్యూ అధికారులపై తిరిగి బెదిరింపులకు తెగబడినట్లు తెలిస్తోంది. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు స్థానిక పోలీసు స్టేషన్‌లో సదరు కబ్జాదారులపై ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా నగర పంచాయతీలో 1400 మంది పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇచ్చింది గాని 3 సంవత్సరాలు దాటిన ఇంతవరకు స్థలం చూపించ లేదు. సరికదా ప్రభుత్వ భూములు అక్రమార్కుల చెరలోకి వెళ్తున్నా పట్టించుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీసులకు ఫిర్యాదు చేశాం
సర్వే నెంబర్‌ 65/3లో ఉన్న సుమారు 60 సెంట్ల స్థలాన్ని గాయ్యాలు భూమిగా గుర్తించాం. ఈ స్థలంలో డి -పట్టా మంజూరు జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఎవరి పేరునైతే డీ-పట్టా మంజూరైందో ఇప్పుడు అతను లేడు. ఇదే స్థలాన్ని డైట్‌ కాలనీకి చెందిన ఒక మహిళ తాను కొనుగోలు చేశానని చెబుతూ దౌర్జన్యంగా నిర్మాణం చేపడుతుంది. దీంతో మా సిబ్బంది వెళ్ళి అడ్డుకోగా మహిళ సిబ్బందిపై దుర్భాసలాడుతూ ఎదురు దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు నోటీసులు ఇచ్చి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. డి-పట్టా భూములను అమ్మకాలు, కొనుగోలు చేయకూడదని చెప్పినా ఆమె మమ్మల్నే బెదిరిస్తోంది.
- శైలజ, తహశీల్దార్‌