Oct 12,2023 23:07

ప్రజాశక్తి-హెల్త్‌ యూనివర్సిటీ: రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా తొలిసారిగా గోవాలో నిర్వహించనున్న 37వ జాతీయ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బృందం పాల్గొంటున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ ఒలింపిక్‌ సంఘం (ఏపీఓఏ) అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం తెలిపారు. గురువారం విజయవాడలోని హోటల్‌ ఐలాపురంలో జాతీయ క్రీడలకు అర్హత సాధించిన క్రీడాకారులతో క్వాలిఫైడ్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ స్టేట్‌ అసోసియేషన్ల సమావేశంతో ఏపీఓఏ సమావేశం నిర్వహించింది. సంఘాల సమావేశం ముగిసిన అనంతరం ఏపీఓఏ అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తం మీడియాతో మాట్లాడారు. భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) నుంచి గుర్తింపు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (సాప్‌) తమ సంఘంతో సమావేశాన్ని ఏర్పాటు చేయలేదన్నారు. నేషనల్‌ గేమ్స్‌-క్వాలిఫైడ్‌ గేమ్స్‌ మరియు స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం కావాలని శాప్‌ అధికారులను కోరిందనీ అయితే వారి నుండి ఎటువంటి స్పందనా లేదన్నారు. ఈ దశలో ఏపీఓఏ ఖర్చులు భరించి గోవా జాతీయ క్రీడలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ స్పోర్ట్స్‌ అథారిటీ మునుపటి సంవత్సరంలో ఏపీఓఏని మోసం చేసిందన్నారు. రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినా ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల కాలేదన్నారు. ఈ సమావేశంలో ఎపిఒఎ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌ బ్రహ్మాజీ, బి వెంకటరామయ్య, చెఫ్‌ డి మిషన్‌ వైవి శివకుమార్‌, డిప్యూటీ చెఫ్‌ డి మిషన్లు సిహెచ్‌ వేణుగోపాల్‌, జి శశికాంత్‌, సపోర్టింగ్‌ స్టాఫ్‌ ఎంవి మాణిక్యాలు, ఎన్‌ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.