Oct 18,2023 19:46

సచివాలయాన్ని ప్రారంభిస్తున్న మంత్రి బుగ్గన

ప్రభుత్వ సేవలు మరింత వేగం
- ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి
ప్రజాశక్తి - బేతంచెర్ల

    బేతంచెర్ల పట్టణంలో 5వ సచివాలయం అందుబాటులోకి రావడంతో సంబంధిత వార్డు ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి తెలిపారు. బుధవారం బేతంచెర్ల పట్టణంలో రూ.40 లక్షలతో నిర్మించిన 5వ సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం స్థానిక ప్రజలతో మంత్రి బుగ్గన మాట్లాడారు. వీధుల్లో ఆయన పర్యటించారు. ఇంకా ఏవైనా సమస్యలు, ఇబ్బందులు ఉన్నాయా అంటూ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంతకు ముందు బేతంచెర్ల క్యాంప్‌ కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి ప్రజలను పలకరిస్తూ స్థానిక ఆలయాలను దర్శించుకున్నారు. అమ్మవారి శాల, అయ్యప్ప, ఆంజనేయ, చెన్నకేశవ, మాధవ ఆలయాలలో పూజా కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. వేద పండితులు ఆలయమర్యాదలతో మంత్రి బుగ్గనను పట్టువస్త్రంతో సత్కరించి, ప్రసాదం అందజేశారు. ఆ తర్వాత రూ.3.70 కోట్లతో జరుగుతున్న కందకం డ్రెయినేజీ కాలువ అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. బేతంచెర్ల పట్టణానికి కీలకమైన ఈ పనులను వేగంగా నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బేతంచెర్ల ఊరి వాకిలి అభివృద్ధికి చొరవ తీసుకోవాలని మున్సిపల్‌ ఛైర్మన్‌ సిహెచ్‌ చలం రెడ్డిని ఆదేశించారు. కందకం పక్కన కోటి లచ్చమ్మ ఆలయానికి స్థలం కేటాయించాలని స్థానిక మహిళలు మంత్రికి విజ్ఞప్తి చేశారు. కందకం పూర్తి తర్వాత దృష్టి సారిద్దామని సానుకూలంగా స్పందించారు. అనంతరం బేతంచెర్ల మార్కెట్‌ యార్డు అభివృద్ధి పనులను పరిశీలించారు. రూ.60 లక్షలతో నిర్మిస్తోన్న మార్కెట్‌ యార్డ్‌ మౌలిక సదుపాయాలపై కాంట్రాక్టర్‌కు పలు ఆదేశాలిచ్చారు. అంతకుముందు బేతంచెర్లలోని వైసిపి కార్యాలయంలో గోరుగుట్ట ఆటో యూనియన్‌ డ్రైవర్లు మంత్రిని కలిశారు. వాహనమిత్ర అందించడం పట్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మున్సిపల్‌ ఛైర్మన్‌ సిహెచ్‌ చలం రెడ్డి, మద్దిలేటి స్వామి ఆలయ ఛైర్మన్‌ రామచంద్రుడు, వైసిపి నాయకులు బాబు రెడ్డి, ఆర్యవైశ్య సంఘ నాయకులు, ఎమ్మార్వో నరేంద్రనాథ్‌ రెడ్డి, పట్టణ వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.