May 19,2023 00:20

దీక్షలనుద్దేశించి మాట్లాడుతున్న కెవిపి చంద్రమౌళి

ప్రజాశక్తి-కలెక్టరేట్‌, విశాఖ : స్వదేశీయత పేరిట కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గంగిగోవు లాంటి ప్రభుత్వ రంగాన్ని అమ్మడం ద్వారా నిజమైన దేశద్రోహానికి పాల్పడుతోందని కెవిపిఎస్‌ జిల్లా ఉపాధ్యక్షులు వై.రాజు విమర్శించారు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుకుంటామన్నారు. స్టీల్‌ ప్లాంట్‌, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక, ప్రజా సంఘాల జెఎసి చేపట్టిన దీక్షలు గురువారం నాటికి 777వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో సిఐటియు జగదాంబ జోన్‌ కార్మికులు, నాయకులు కూర్చున్నారు. శిబిరం వద్ద ఏర్పాటుచేసిన కళాఖండాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వై.రాజు మాట్లాడుతూ ప్రయివేటు రంగంలో, దళితులు, మైనారిటీలకు రిజర్వేషన్లు ఉండవన్నారు. ప్రతి ఇంటిలో ఒకరో, ఇద్దరో ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారని, అటువంటి వారికి ఉపాధి రావాలన్నా ఉద్యోగ అవకాశాలు కలగాలన్నా ప్రభుత్వ రంగంలోనే సాధ్యపడుతుందని చెప్పారు. అటువంటి ప్రభుత్వ రంగాన్ని నాశనం చేసేందుకు, కార్పొరేట్‌ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేందుకు మోడీ ప్రభుత్వం కృషిచేస్తోందని విమర్శించారు. ఈ చర్యలను దళిత సంఘాల ఐక్యతతో ఎదుర్కొంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జగదాంబ జోన్‌ ప్రధాన కార్యదర్శి కెవిపి.చంద్రమౌళి, జోన్‌ కార్యదర్శి జి.ఈశ్వరరావు, ముఠా కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సుబ్బారావు, సిఐటియు జిల్లా కార్యదర్శి జి.అప్పలరాజు, డివైఎఫ్‌ఐ నాయకులు కె.గణేష్‌, కె.సంతోష్‌కుమార్‌, ఎం.ఈశ్వరరావు, ఎన్‌.ఎర్రిబాబు, డివిడి రాజు, మదీనా తదితరులు పాల్గొన్నారు.