ప్రజాశక్తి - కలెక్టరేట్ : రిజర్వేషన్లకు భంగం కలిగించే ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణను అడ్డుకుంటామని జివిఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి ముద్దాడ వరప్రసాదరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్, ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక, ప్రజా సంఘాల జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షలు మంగళవారానికి 495వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో జివిఎంసి పారిశుధ్య కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ రంగంలోని విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో వందలాది మంది ఎస్‌సి, ఎస్‌టి తరగతులకు చెందిన వారు ఉద్యోగాలు చేస్తున్నట్టు తెలిపారు. దీనికి కారణం ప్లాంట్ ప్రభుత్వ రంగంలో నడుస్తున్న సంస్థ కావడమేనన్నారు. విశాఖ నగరంలోని అనేక ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు అమలు జరిగి దళిత, గిరిజనులు మెరుగైన జీవితాలు సాగిస్తున్నారని చెప్పారు. రిజర్వేషన్లకు అవకాశం కల్పిస్తున్న ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. దీక్షల్లో సిఐటియు కంచరపాలెం జోన్ కార్యదర్శి ఒ.అప్పారావు, వి.సీతాలక్ష్మి, పి.సింహాచలం, బి.ప్రశాంతి, పి.రాజు, ఎ.సత్యవతి, జి.నూకరాజు పాల్గొన్నారు.










