ప్రజాశక్తి-ఉక్కునగరం : ప్రభుత్వ రంగ సంస్థలను తెగ నమ్మటానికి బిజెపి ప్రభుత్వం పూనుకుందని, దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు పిలుపునిచ్చారు. ఉక్కునగరంలోని అంబేద్కర్ కళాక్షేత్రంలో పబ్లిక్ సెక్టార్ కో-ఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యాన వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో స్టీల్‌ప్లాంట్, బిహెచ్‌ఇఎల్, షిప్‌యార్డు, హెచ్‌పిసిఎల్, ఎన్‌టిపిసి, డాక్ యార్డు, పోర్టు, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్, పవర్ గ్రిడ్, రైల్వే తదితర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి కార్మిక ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానంగా పబ్లిక్ సెక్టార్‌కు రాబోయే ప్రమాదాలపై చర్చించారు. ఈ ప్రమాదాన్ని నిలువరించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని పబ్లిక్ సెక్టర్ కో-ఆర్డినేషన్ కమిటీ ప్రతినిధులు తెలిపారు. అందులో భాగంగా స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ, రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకే కేంద్ర ప్రభుత్వం ప్రయివేటీకరణ నిర్ణయాన్ని తీసుకుంటుందన్నారు. విద్యుత్ ప్రయివేటీకరణపై ముందుకు వెళితే దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ వంటి ప్రభుత్వ రంగ సంస్థ ప్రయివేటీకరణ జరిగితే ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. ఆల్ ఇండియా పోర్డు యూనియన్ పిలుపుమేరకు పోర్టు ప్రయివేటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అన్ని పరిశ్రమల వద్ద సెప్టెంబర్ 15న నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా వినాయక చవితి సందర్భంగా అన్ని వినాయక విగ్రహాల వద్ద సంతకాల సేకరణ చేపడతామని చెప్పారు. సిపిఎం స్టీల్ జోన్ కార్యదర్శి శ్రీనివాసరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ, పబ్లిక్ సెక్టర్ కో-ఆర్డినేషన్ కమిటీ కన్వీనర్ జ్యోతీశ్వరరావు, కుమారమంగళం, స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) అధ్యక్షులు జె.అయోద్యరామ్ పాల్గొన్నారు.










