Jul 21,2023 21:15

సమావేశంలో మాట్లాడుతున్న పంజం సుకుమార్‌రెడ్డి

రాయచోటి : ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు రైతులందరికి చేరేలా ప్రతి ఒక్కరూ కషి చేయాలని జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్‌ పంజం సుకు మార్‌రెడ్డి, జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జిల్లా వ్యవసాయ సలహా బోర్డు చైర్మన్‌ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ వ్యవసాయ, అనుబంధ రంగాలను మరింత పటిష్టం చేసి లాభాల బాటలోకి తీసుకురావాలన్నరు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా వ్యవసాయ రంగంలో రైతులు లాభాల బాటలో నడిచేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తతమైన సేవలు అందివ్వాలని సూచించారు. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. పంట సాగుబడిలో విత్తనం మొదలు, దిగుబడి వరకు అన్ని దశల్లో క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధి కారుల పర్యవేక్షణ జరగాలన్నారు. రైతులకు అవసరమైన, వ్యవసాయాధికారులు ఆమోదించిన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా వ్యాప్తంగా చిరుధాన్యాల సాగు విస్తతం చేసేలా రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. రైతులకు ఉపాధి హామీ తరఫున మురింగ (మునగ) ప్లాంటేషన్‌ ఏర్పాటు చేయాలని, మదనపల్లిలో టమోటా ప్రాసెసింగ్‌ ఏర్పాటు చేయాలని కోరారు. వర్షాభావ పరిస్థితుల్లో వలన రైతులు సకాలంలో పంటలు సాగు చేయలేకపోయారని ప్రత్యామ్నాయ పంటలు సంబంధిత విత్తన ములు సబ్సిడీపై అందించాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవసాయాభివద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. రైతుభరోసా, పీఎం కిసాన్‌ పథకాలతో సంవత్సరానికి రూ.13,500 అందజేస్తున్నారని, పంటల బీమా, పంటల నష్టపరిహారం, ఎరువులు, విత్తనాల సరఫరా, సాగు యాంత్రీకరణ పరికరాలు రాయితీపై అందజేస్తునట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను రైతులు వినియోగించుకుని అభివద్ధి చెందుతున్నట్లు చెప్పారు. వివిధ ఉద్యాన పంటల సాగు ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు. గ్రామాల వారీగా ఆర్బీకేల పరిధిలో వ్యసాయ సహాయకులు సీజన్‌ వారీగా ఆయా ప్రాంతాల్లో పండించే పంటలు, వాటికి ఆశించే చీడపీడలు, పైర్లకు అందాల్సిన పోషక విలువలు, ఎరువుల వాడకంపై ముందస్తుగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే నిర్వహించిన మండల వ్యవసాయ సలహా మండలి సమావేశాలలో చర్చించిన అంశాల ప్రతిపాదనలను, గత జిల్లా వ్యవసాయ సలహామండలి సమావేశంలో బోర్డు సభ్యుల నివేదికలను పరిశీలించిన బోర్డు వాటిని ఆమోదం తెలిపారు. గత సమావేశంలో సభ్యులు లేవనెత్తిన పలు అంశాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు వివరణలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్‌, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు దీన్నేపాడు రవిరాజు, బోదశ వలి, రవి కుమార్‌ రెడ్డి, ఇరిగేషన్‌ అధికారులు, ఉద్యానశాఖ, మత్స్యశాఖ, పట్టు పరిశ్రమ శాఖ అధికారులు, సహకార, సివిల్‌ సప్‌, వ్యవసాయ సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.